- రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన ఆఫీసర్లు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 48 అడుగులకు చేరుకుంది. దీంతో గురువారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఆఫీసర్లు రెండో ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ జితేశ్ కుమార్ వి పాటిల్ ఆదేశాలతో గోదావరి పరివాహక ప్రాంతంలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల సెక్టోరియల్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు.
అయితే ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని, శబరి ఉప నదుల్లో ప్రవాహం తగ్గడంతో పాటు ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద కూడా వరద తగ్గుముఖం పట్టింది. దీంతో వరద ముప్పు తొలగినట్లేనని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. వరద పూర్తిగా తగ్గి గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడేంత వరకు ఆఫీసర్లంతా మండలాల్లోనే ఉండి శానిటేషన్ తదితర కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఐటీడీఏ పీవో బి.రాహుల్ పర్యవేక్షణలో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.
