టూర్లకు మస్త్​గ పోతున్నరు

టూర్లకు మస్త్​గ పోతున్నరు

ఎండాకాలంలో ఫ్యామిలీతో కలిసి చల్లగా ఉండే, మనసుకి హాయినిచ్చే ప్లేస్​లకి  వెళ్లాలని ఉంటుంది ఎవరికైనా. కానీ, కరోనా కారణంగా గత రెండేండ్లు ఎక్కడికీ టూర్ వేయలేదు చాలామంది. అయితే, చాలా దేశాలు కరోనా ఆంక్షలు ఎత్తేయడంతో మళ్లీ టూరిస్ట్​లు తమకు నచ్చిన ప్లేస్​లు చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది వేసవి మొదలై నెల రోజులైనా కాలేదు ఇప్పటికే చాలామంది సమ్మర్ హాలిడే బుకింగ్స్ చేసుకున్నారట. వీళ్లలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం 
టూరిస్ట్​ ప్లేస్​లని ఎంచుకున్నవాళ్లు కూడా ఉన్నారని అంటున్నారు ట్రావెల్​ ఏజెంట్స్. 


మనదేశంలో టూరిస్ట్​లు కేరళ, ఊటీ, గోవా, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్లేస్​లకు ‘క్యూ’ కడుతున్నారు.  ఢిల్లీలో ఉండేవాళ్లు డెహ్రాడూన్, ముస్సోరీ, సిమ్లా, రిషికేష్​లకి టూర్​ వేస్తున్నారట. కొందరేమో  స్విట్జర్​లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్పెయిన్, బెల్జియం చుట్టిరావడానికి బుకింగ్స్ చేసుకున్నారు. వీసా ఉన్నవాళ్లు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా చూసేందుకు పోతున్నారు. పోయిన ఏడాది జనవరితో పోలిస్తే... ఈ దేశాలకు 60 శాతం ఫ్లయిట్ బుకింగ్స్ అయ్యాయి. యుఎఇ, మాల్దీవులకు ఈ నెలలో రావాల్సిన వాళ్లలో 80 శాతం మంది టూరిస్ట్​లు వచ్చారు. ట్రావెల్ బుకింగ్స్​ పదిశాతం, హోటళ్లలో గదుల కిరాయి 35 శాతం పెరిగాయట. అంటే పోయిన ఏడాది రూ.2500 ఉన్న హోటల్ రూమ్​ అద్దె ఇప్పుడు 7500 రూపాయలు అయింది. విమాన ఛార్జీలు కూడా 20–25 శాతం పెరిగాయి. హాలిడే ప్యాకేజీలు, ఫ్లయిట్ టికెట్లు, హోటళ్లు దాదాపు ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి అంటున్నారు ఏజెంట్లు. 
గత రెండేండ్లలో లేనంతగా 
‘‘టూరిస్ట్​లు ఇంతలా రావడం 2019లో చూశాను. అయితే, ఈసారి అప్పటికంటే ఎక్కువ బిజినెస్ అవుతోంది. పోయిన నెలలో   గత రెండేండ్లలో కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి” అని చెప్పాడు గురుగావ్​కు చెందిన ఆర్గోసి ట్రావెల్స్ డైరెక్టర్ ఆకాశ్​ రస్తోగి.  ‘‘పోయిన ఏడాది మూడు నాలుగు ఫైళ్ల నిండా బుకింగ్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు యూరప్​ బుక్సింగ్​ కాపీలతో 18–20 ఫైళ్లు నిండుతున్నాయి. మనదేశంలోని టూరిస్ట్ ప్లేస్​ల బుకింగ్స్, అక్కడి సౌకర్యాల గురించి అడిగే  టూరిస్ట్​ల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది” అంటోంది  ఢిల్లీకి చెందిన ఆర్​ఎన్​ టూర్ అండ్ ట్రావెల్స్​ కంపెనీ డైరెక్టర్​ నేహా ప్రణయ్.