- మేడారం జాతర, నాంపల్లి నుమాయిష్, శిల్పారామంలో ఫుల్ సేల్స్
- అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో, కలెక్టరేట్లలో అమ్మేలా ప్లాన్
- మెషినరీకి సహకారం అందించాలని సంఘాల విన
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆదివాసీ మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూలకు అద్భుతమైన స్పందన వస్తున్నది. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే విక్రయిస్తున్న ఈ లడ్డూలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచాలని ట్రైబల్ శాఖ ప్లాన్ చేస్తున్నది. మసాబ్ ట్యాంక్ డీఎస్ ఎస్ భవన్ తో పాటు సెక్రటేరియెట్ దగ్గర ట్రైబల్ శాఖ గిరి వికాస్ ఔట్ లెట్లు ఉన్నాయి. వీటితో పాటు అన్ని కలెక్టరేట్లలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టాల్స్, డీమార్ట్, విజేత, రిలయన్స్ వంటి సూపర్‌మార్కెట్లలో అమ్మాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
3 లక్షల పెట్టుబడికి.. 10 లక్షల ఆదాయం
ఈ ఏడాది మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఇప్పపువ్వు లడ్డూ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతర చరిత్రలో మొదటిసారిగా సమ్మక్క–సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఈ లడ్డూలు విక్రయించింది. రూ.3 లక్షల పెట్టుబడితో తయారు చేసి రూ.10 లక్షల లాభాలు సాధించారు. జాతరలో 10 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 250 గ్రాముల బాక్సు రూ.150కు, కిలో రూ.600కు అమ్మారు.
జాతర సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులందరికీ ఈ లడ్డూలు అందించారు. మాదాపూర్ శిల్పారామంలో స్టాల్ ఏర్పాటు చేశారు. అలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ లో 45 రోజుల పాటు అమ్మగా బాగా సేల్స్ అయ్యాయి. ఔషధ గుణాలు అధికంగా ఉండే ఈ లడ్డూలు గర్భిణులకు ప్రత్యేకంగా మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం నెల రోజుల నిల్వ మాత్రమే ఉంటోంది. లడ్డు తయారీ యంత్రాల కొనుగోలుకు సహకారం అందిస్తే ఉత్పత్తి పెంచవచ్చని మహిళా సంఘాలు కోరుతున్నాయి. గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఇప్పపువ్వు లడ్డూ తయారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సెర్ప్ ఆధ్వర్యంలో గవర్నర్ దత్తత గ్రామమైన కొండపర్తిలో వీరికి శిక్షణ ఇచ్చారు. ఉట్నూర్ ఐటీడీఏ బృందం మార్కెటింగ్‌పై కూడా ట్రైనింగ్ అందించింది. కన్నేపల్లి గ్రామానికి చెందిన సమ్మక్క-సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఎంఎస్‌ఎంఈ రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్ పొంది లడ్డూలు తయారు చేస్తోంది.
ప్రభుత్వం సహకరిస్తే విస్తరిస్తాం
మాదాపూర్ శిల్పారామంలో స్టాల్ ఏర్పాటు చేశాను, సేల్స్ బాగున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ లో, ఇటీవల మేడారం జాతరలో కూడా బాగా అమ్మాయి. కేజీ రూ. 500 కు అమ్ముతున్నాం. లడ్డూ తయారీ మెషీన్ల కొనుగోలుకు ప్రభుత్వం సహకారం అందించాలి. ఈ విషయంపై ఇటీవల సెర్ఫ్ సీఈవో ను అడిగాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మెషీన్లు వస్తే హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా అమ్ముతం.
- కుమరం బాగుబాయి, బాగుబాయి సంఘం, ఉట్నూరు
