
- తనిఖీలకు దూరంగా సెంట్రల్ఎక్సైజ్, ఇన్ కమ్ట్యాక్స్ శాఖలు
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసాలో బంగారు జీరో దందా విచ్చలవిడిగా సాగుతోంది. సరైన అనుమతులు లేకుండానే కొందరు వ్యాపారులు హోల్సేల్ గా బంగారం అమ్ముతున్నారు. అభరణాల అమ్మకాల్లోనే వినియోగదారులను కొందరు మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు వ్యాపారులు వినియోగదారులను మోసగిస్తున్నారు.
అంతా జీరో దందానే..
ముథోల్ నియోజకవర్గానికి ప్రధాన మార్కెట్భైంసా పట్టణమే. మొత్తం వందకుపైగా దుకాణాలు ఉండడంతో నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు భైంసాలోనే బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి మార్కెట్లో నిత్యం రూ.50 లక్షల వరకు బంగారం, వెండి క్రయ విక్రయాలు జరుగుతాయి. కాగా ఇక్కడ ఒకరిద్దరు మినహా మిగతా వ్యాపారులంతా జీరో దందానే కొనసాగిస్తున్నట్లు సమాచారం.
అనుమతులు లేకుండానే కొందరు హోల్సేల్లో బంగారం అమ్ముతున్నారు. మరికొందరు దుకాణదారులు వినియోగదారులు కొనుగోలు చేసే ఆభరణాలకు ఆన్లైన్ పేమెంట్స్తీసుకోవడంలేదు. కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఆన్లైన్పేమెంట్స్తో ఐటీ సమస్యలు వస్తాయని ఇలా చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించే పన్ను ఎగవేస్తున్నారు. ఈ వ్యవహారమంతా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తనిఖీలు లేవా?
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్, బుధవార్ పేట్ప్రాంతాల్లో శుక్రవారం పలు బంగారు దుకాణాలపై వాణిజ్య పన్నుల శాఖ, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు ఐటీ దాడులు చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేశారు. అయితే జిల్లాలోనే ఎక్కువగా బంగారు వ్యాపారం సాగే భైంసాలో మాత్రం ఎలాంటి తనిఖీలు చేపట్టడంలేదు.
బంగారం విషయంలో మోసపోయిన బాధితులు సెంట్రల్ఎక్సైజ్, తూనికలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా తనిఖీలు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.