భారత గడ్డపై మహిళలకు అవమానం.. తాలిబన్ మంత్రి ప్రెస్ మీట్లో నిషేధంపై వివాదం.. ప్రభుత్వం క్లారిటీ

భారత గడ్డపై మహిళలకు అవమానం.. తాలిబన్ మంత్రి ప్రెస్ మీట్లో నిషేధంపై వివాదం.. ప్రభుత్వం క్లారిటీ

ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ప్రెస్ మీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. శుక్రవారం (అక్టోబర్ 10) తాలిబన్ మంత్రి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు మహిళా జర్నలిస్టులను నిషేధించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రెస్ మీట్ లో మహిళలను నిషేధించడంలో విదేశాంగ శాఖ ప్రమేయం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. 

ఢిల్లీలో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ వివాదాస్పదంగా మారింది. తాలిబన్ల లింగ వివక్షను భారత గడ్డపై ప్రదర్శించడం సిగ్గు చేటు.. అందుకు భారత మంత్రులు సహకరించడం దారుణం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  కేవలం పురుషులైన జర్నలిస్టులతో నే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఫోటోగ్రాఫ్స్ వైరల్ అయ్యాయి. 

ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రతి మహిళను ఉద్ధరిస్తానని చెప్తున్న మోదీ.. పబ్లిక్ ఫోరం లో ప్రెస్ మీట్ లో మహిళలను బహిష్కరించటానికి ఎలా మద్ధతిస్తారని ప్రశ్నించారు. 

మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో మహిళలపై జరిగిన వివక్షపై మౌనంగా ఉండటంతో.. మీ నారీ శక్తి స్లోగన్ అంతా ప్రచారం వరకే అనే విషయం స్పష్టమవుతోందని విమర్శించారు. 

మరోవైపు ప్రియాంక గాంధీ ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. తాలిబన్ మంత్రి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మహిళలను నిషేధించడంపై మీ అభిప్రాయం ఏంటో చెప్పాలని మోదీనికి  డిమాండ్ చేశారు. 

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పరిస్థితి దారుణంగా ఉన్న మాట వాస్తవం. మహిళలను విద్య, ఉద్యోగాలతో పాటు ఇతర పబ్లిక్ ప్లేసెస్ లో నిషేధించారు. దీనిపై ఇప్పటికే అక్కడి మహిళలు ఉద్యమిస్తున్నారు.