నిరుద్యోగులకు, యువతకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. పాలన మార్పు కోసం (రెజైమ్ చేంజ్) హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలను మరింత కఠినం చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది.
ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి లేదా రెజీమ్ చేంజ్ కోసం హింసాత్మక మార్గాలను అనుసరించే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణించడం జరుగుతుందని 2026 అక్టోబర్ 29న బాంబు పేల్చింది. ఇవి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, కౌన్సిళ్లు, స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిబంధనలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
కేవలం రాజకీయ భావజాలం లేదా ఆలోచనల ఆధారంగా ఎవరినీ అనర్హులుగా ప్రకటించరు. అయితే, హింస ద్వారా ప్రస్తుత వ్యవస్థను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పేర్కొన్నారు.
మూడేళ్ల డెడ్ లైన్:
యువత 21 ఏళ్లు దాటిన తర్వాత ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినట్లయితే.., విచారణ తేదీకి ముందు మూడేళ్లలోపు అటువంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలి. విచారణకు ముందు మేడేళ్లలో నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిస్తే ఇంకా చురుకుగా ఉన్నట్లుగా పరిగణిస్తారు.
ఏ కేసుల్లో అనర్హత?
హత్య, దోపిడీ, రేప్, మహిళా గౌరవం హననం, అవినీతి, ఉగ్రవాద కార్యకలాపాలు, పేపర్ లీక్, సాల్వర్ గ్యాంగ్‌లు, కొన్ని సైబర్ నేరాలు మనీ లాండరింగ్, నార్కోటిక్స్, సంఘటిత నేరాలు వంటి కేసుల్లో పాల్గొన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు.
అయితే, కేవలం ఎఫ్ఐఆర్ నమోదు కావడం లేదా విచారణ జరుగుతున్నంత మాత్రాన అనర్హలు కాదు. రాజీ కుదుర్చుకుని పరిష్కారమైన కేసులు, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వచ్చిన కేసుల విషయంలో అనర్హత ఉండదు. అలా కేసుల నుంచి బయటపడిన వారిని అర్హులుగా పరిగణిస్తారు.
30 రోజుల్లోగా పోలీసు వెరిఫికేషన్:
జిల్లా పోలీసులు, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ 30 రోజుల్లోగా క్యారెక్టర్ వెరిఫికేషన్ రిపోర్ట్ సమర్పించాలి. ఆలస్యమైతే హోమ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. అభ్యర్థి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. రిపోర్ట్ నెగెటివ్ గా వస్తే జిల్లా మేజిస్ట్రేట్ అభ్యర్థికి వివరణ ఇవ్వాలి.
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొత్తగా వెరిఫికేషన్ అవసరం లేదు. ఈ నిబంధనలు 1958 నాటి పాత ఆదేశాలను మరింత స్పష్టం చేస్తూ, ఆలహాబాద్ హైకోర్టు ఇటీవలి పరిశీలనల ఆధారంగా వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది.
