పెళ్లి చేసుకుంటున్నారా ? మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌కి ఆధార్ చెల్లదు.. హైకోర్టు కీలక ఆదేశాలు

పెళ్లి చేసుకుంటున్నారా ?  మ్యారేజ్  రిజిస్ట్రేషన్‌కి ఆధార్ చెల్లదు.. హైకోర్టు కీలక ఆదేశాలు

మ్యారేజ్  రిజిస్ట్రేషన్ విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి చేసుకునే వారి వయస్సును నిర్ధారించేందుకు ఆధార్ కార్డును ఆధారంగా తీసుకోవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే, సరైన ధ్రువీకరణ లేని స్కూల్  ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లను కూడా వయస్సు రుజువుగా అంగీకరించకూడదని పేర్కొంది. బాల్య వివాహాల నమోదు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

పెళ్లికి ముందు  
వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో వరుడికి కనీసం 21 ఏళ్లు, వధువుకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలని జస్టిస్ తేజ్ ప్రతాప్ తివారీ స్పష్టం చేశారు. ఈ వయస్సులను నిర్ధారించిన తర్వాతే వివాహాన్ని రిజిస్టర్ చేయాలని అధికారులకు సూచించారు. దీపక్ పాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక వివాహాన్ని నమోదు చేసేందుకు స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులను ఆధారంగా తీసుకున్న వ్యవహారాన్ని కోర్టు పరిశీలించింది.

ఆధార్ కార్డుతో వయస్సు 
ఈ కేసులో సమర్పించిన స్కూల్  ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ను నిబంధనల ప్రకారం ధ్రువీకరించలేదని కోర్టు గుర్తించింది. దీంతో వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో అధికారుల వద్ద వయస్సును నిర్ధారించే సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఆధార్ కార్డు ఒక్కటే వయస్సును నిరూపించడానికి సరిపోదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ధ్రువీకరించని ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ను కూడా వయస్సు రుజువుగా పరిగణించలేమని తెలిపింది. పిల్లల వయస్సును నిర్ధారించేందుకు చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ప్రూఫ్స్  పరిశీలించాలని సూచించింది.

అనుమానం వస్తే పెళ్లి  
వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించింది.

*వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో వయస్సును నిర్ధారించేందుకు ఏ ప్రూఫ్స్  ఉపయోగించారో ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎంటర్  చేయాలి.
* ప్రూఫ్స్ లేదా  గుర్తింపు డాకుమెంట్స్ లో తప్పులు లేదా వివరాల్లో తేడాలు ఉన్నాయా అని అధికారులు గుర్తించాలి.
*వయస్సు నిర్ధారణ ప్రక్రియ పూర్తికాకపోతే మ్యారేజ్  రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్  ఆటోమేటిక్‌గా జారీ చేయకూడదు.
* ఇచ్చిన ప్రూఫ్స్ లేదా డాకుమెంట్స్  పై అనుమానం కలిగినా, లేదా వధూవరుల్లో ఎవరైనా మైనర్ అని తేలినా, ఆ విషయాన్ని బాల్య వివాహాల నిరోధక అధికారికి, జిల్లా మేజిస్ట్రేట్‌కు తెలియజేయాలి.

వివాహ రిజిస్ట్రేషన్  ఉద్దేశం 
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సీమా వర్సెస్ అశ్వనీ కుమార్ తీర్పును కూడా హైకోర్టు ప్రస్తావించింది. వివాహాన్ని రిజిస్టర్ చేయడం అంటే రిజిస్టర్‌లో పుట్టిన తేదీని ఎంటర్ చేయడం మాత్రమే కాదని పేర్కొంది. వివాహం చేసుకునే వారి వయస్సును అధికారులు సక్రమంగా నిర్ధారించేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలని స్పష్టం చేసింది. బాల్య వివాహాలను అడ్డుకోవడం, వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం చాలా ముఖ్యమని కోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ కేసును తదుపరి విచారణ కోసం నవంబర్ 27కు వాయిదా వేసింది. అప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో వివాహ రిజిస్ట్రేషన్ చేసే అధికారులు వధూవరుల వయస్సులను తప్పనిసరిగా ధ్రువీకరించాలని, అనుమానాస్పద కేసులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.