
హైదరాబాద్, వెలుగు: బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయమందించే పథకం గైడ్లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. అంతకుముందు సెక్రటేరియెట్లో పథకం వెబ్సైట్ tsobmmsbc.cgg.gov.in ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. అర్హులైన చేతివృత్తిదారులు ఆర్థిక సాయం కోసం ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
బీసీలకు ఆర్థిక సాయానికి అప్లికేషన్లు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ‘‘ఫొటో, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సులువుగా అప్లై చేసుకునేలా వెబ్సైట్ రూపొందించాం. దరఖాస్తులను జిల్లా యంత్రాంగం పరిశీలించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. లబ్ధిదారులు తమ వృత్తికి సంబంధించిన పనిముట్లు, ముడిసరుకు కొనుక్కోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు పాల్గొన్నారు.
ఇవీ గైడ్ లైన్స్...
- కుటుంబంలో ఒకరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు.
- వయసు 18 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలి.
- మండలం, మున్సిపాలిటీల లెవల్ లో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. ఇది ఈ నెల 26 వరకు పూర్తవుతుంది.
- కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. తర్వాత జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ఆమోదం కోసం పంపిస్తారు. ఇది జులై 4 వరకు పూర్తవుతుంది.
- లబ్ధిదారుల లిస్టును గ్రామ పంచాయతీ, మండలాల వారీగా వెబ్ సైట్ లో ఉంచుతారు. ఇది దశలవారీగా ఉంటుంది.
- పథకం ప్రారంభం తర్వాత లబ్ధిదారులకు అకౌంట్ లో డబ్బులు వేస్తారు.