పంచాయతీ పోరుకు ఏర్పాట్లు షురూ .. బీఎల్వోలకు శిక్షణ ప్రారంభం

పంచాయతీ పోరుకు ఏర్పాట్లు షురూ .. బీఎల్వోలకు శిక్షణ ప్రారంభం
  • మండలాల వారీగా చేరిన ఎన్నికల సామగ్రి
  • ఓటర్​ లిస్టుల అప్​డేట్​ పై దృష్టిపెట్టిన అధికారులు

మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: గ్రామ పంచాయతీల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపు నిర్వహించాలనే హై కోర్టు ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్​ఎప్పుడు వచ్చినా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల వారీగా ఓటర్లు ఎంత మంది ఉన్నారు, ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి, ఎన్నికల నిర్వహణకు ఎంత మంది అధికారులు, సిబ్బంది అవసరం అనేది గుర్తించారు. 

సవరణలకు అనుగుణంగా ఓటర్ లిస్టులను అప్ డేట్ చేయడంపై దృష్టిపెట్టారు. పోలింగ్ కు అవసరమైన సామగ్రి జిల్లా పంచాయతీ ఆఫీసులకు చేరగా మండలాల వారీగా అవసరమైన సామగ్రి విభజన ప్రక్రియ పూర్తి చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్  రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇదివరకే శిక్షణ ఇవ్వగా ఇప్పుడు బీఎల్ వోలకు శిక్షణ ఇస్తున్నారు. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో మొత్తం 508 పంచాయతీలు 4,508 వార్డులు ఉన్నాయి. గతేడాది పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో  మొత్తం 6,14,371 ఓటర్లుండగా వీరిలో పురుషులు 3,02,221 మంది, మహిళలు 3,12,043 మంది,  ఏడుగురు ఇతరులు ఉన్నారు.  పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 9,222 మంది అధికంగా ఉండగా ఇటీవల అధికారులు మళ్లీ ఓటరు జాబితాలను సవరిస్తుండడంతో వీటి సంఖ్యలో కొంత మార్పు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పోలింగ్ కు సంబంధించిన బ్యాలెట్ బ్యాక్సులను సిద్ధం చేసిన అధికారులు ఇతర సామగ్రిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ లిస్ట్ రెడీ చేసి సవరణలకు అనుగుణంగా అప్ డేట్ చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల  గుర్తింపుతో పాటు ఎన్నికల సామగ్రి మండలాల వారీగా పంపించారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇదివరకే శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం బీఎల్ వోలకు ట్రైనింగ్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 631 పంచాయతీలు ఉండగా, వార్డులు 5,542 ఉన్నాయి.  మొత్తం 7,83,386 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 3,87,954 మంది, మహిళలు 3,95,379, ఇతరులు 47 మంది ఉన్నారు. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్ల వారీగా సంగారెడ్డి, ఆందోల్ కలిపి 13 మండలాలు, నారాయణఖేడ్ లో 7 మండలాలు, జహీరాబాద్ డివిజన్ లో 6 మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పోలింగ్ కు సంబంధించి 4,778 బ్యాలెట్ బ్యాక్సులను సిద్ధం చేసి ఉంచారు.

మెదక్ జిల్లాలో..

జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 పంచాయతీలు ఉన్నాయి.  జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో కలిపి 5,24,451 మంది ఓటర్లు ఉన్నారు. సవరణల తర్వాత ఓటర్ లిస్టుల అప్ డేట్  ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టారు. ఇదివరకు ఉన్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇదివరకే శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు బీఎల్ వో లకు శిక్షణ ఇస్తున్నారు.  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి జిల్లా పంచాయతీ ఆఫీసుకు చేరింది. ఈ మేరకు మండలాల వారీగా ఆ సామగ్రి విభజన పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని డీపీవో యాదయ్య తెలిపారు.