మంగపేటలో జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

మంగపేటలో జడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ములుగు/మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్  గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్​ జారీ చేసింది.  

మంగపేటలో 14 ఏండ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. గిరిజన, గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్​ వివాదం కోర్టులో పెండింగ్​లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఫైనల్​ హియరింగ్​ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న ఉండడంతో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్​ మెంబర్​ ఎన్నికలను వాయిదా వేసింది. మంగపేట జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల కమిషన్​ పేర్కొంది. రెండు రోజుల కింద మంగపేట జడ్పీటీసీ స్థానాన్ని జనరల్​ మహిళకు ఖరారు చేశారు. ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టలేదు. 

జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని ములుగు డీపీవో దేవరాజు వెల్లడించారు. ఏళ్ల తరబడి స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక అభివృద్ధి కుంటుపడుతోందని, ఈక్రమంలో జడ్పీటీసీ ఎన్నిక జరగనుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు అనంతరం ఎంపీటీసీ, సర్పంచ్  ఎన్నికలు సైతం జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.