సాహిత్య రూపంలో మిడ్కో సజీవం

 సాహిత్య రూపంలో మిడ్కో సజీవం
  • పుస్తకావిష్కరణ సభలో పలువురు వక్తలు

హనుమకొండ, వెలుగు: ఉద్యమకారిణి, రచయిత, సామాజికవేత్త గుముడవెల్లి రేణుక(మిడ్కో) భారత సాహిత్యంపై చెరగని ముద్ర వేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఆపరేషన్ కగార్ కు బలైన ఆమె సాహిత్య రూపంలో ఎప్పుడూ సజీవంగానే ఉంటారని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయలో గుముడవెల్లి రేణుక(మిడ్కో) సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ సభ ఆదివారం జరిగింది. మిడ్కో తల్లిదండ్రులు జయమ్మ, సోమయ్య, విరసం నేతలు,  వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ముందుగా మిడ్కో  సమగ్ర సాహిత్య పుస్తకంతో పాటు ఆమెపై రాసిన పాటల సీడీని ఆవిష్కరించారు. 

అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న విప్లకారులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. దండకారణ్యం, ఆదివాసీలపై అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై మిడ్కో ఎన్నో రచనలు చేశారని తెలిపారు. ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను తన రచనల ద్వారా బయటపెట్టారని  చెప్పారు. రేణుక రచనలను ప్రభుత్వం వద్దకు చేరేలా మేధావులు దృష్టి సారించాలని, ఆదివాసీల జీవితాలను వెలుగులోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మిడ్కో మహిళల సమస్యలను తన కథల్లో ప్రతిబింబించారని, వాటిని చదివి ఆచరణలో పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ సలహాదారుడు నరసింహులు, కన్వీనర్ అస్నాల శ్రీనివాస్, మిడ్కో రచనలను సమీకరించిన రవీందర్, దండకారణ్య ఉద్యమ నిర్మాత లంక పాపిరెడ్డి, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌నాయకురాలు రమక్క, వివిధ సంఘాల నేతలు గోరటి అరుణ, అస్నాల విమల, సూరేపల్లి సుజాత, శాఖమూరి రవి, జిలకర శ్రీనివాస్, ప్రముఖ గాయకుడు సుక్క రాంనర్సయ్య పాల్గొన్నారు.