
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరగనున్న గురుకుల రిక్రూట్ మెంట్ పరీక్షలకు ఒకే జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేయాలని డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీవైఎల్ తదితర సంఘాలు డిమాండ్ చేశాయి. మల్టీ పర్పస్ ఎగ్జామ్ సెంటర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆ సంఘాలు కోరాయి. సోమవారం హాల్ టికెట్ల గందరగోళాన్ని నిరసిస్తూ మాసాబ్ ట్యాంక్ లోని గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు ఆఫీసు ముందు యువజన సంఘాలు ఆందోళన చేశాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం జరిగింది.
అనంతరం గురుకుల బోర్డు డిప్యూటీ సెక్రటరీ తిరుపతయ్యకు నేతలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ఏఐవైఎఫ్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మేంద్ర, కేఎస్ ప్రదీప్ మాట్లాడారు. గురుకుల పోస్టులకు ఎగ్జామ్ సెంటర్లను ఒక్కో అభ్యర్థికి రెండు, మూడు జిల్లాల్లో కేటాయించారని, దీనివల్ల అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లడం గర్భిణీ స్త్రీలు, చంటిపిల్లల తల్లులకు ఇది ఇబ్బందికరంగా మారిందన్నారు.