ఆఫీసర్ల చేతికి  మున్సిపల్‍ కార్పొరేషన్లు.. మే 6న గ్రేటర్ వరంగల్, 7న ఖమ్మం మున్సిపల్‍ కార్పొరేషన్ల గడువు పూర్తి 

ఆఫీసర్ల చేతికి  మున్సిపల్‍ కార్పొరేషన్లు.. మే 6న గ్రేటర్ వరంగల్, 7న ఖమ్మం మున్సిపల్‍ కార్పొరేషన్ల గడువు పూర్తి 
  • రెండుచోట్లా ఇప్పటివరకు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టని ఆఫీసర్లు 
  • గ్రేటర్‍ వరంగల్లో 66 నుంచి 100 డివిజన్లకు పెంచే అవకాశం
  • ఖమ్మంలో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లపై నో క్లారిటీ 
  • వరంగల్‍ మేయర్‍ పీఠం జనరల్‍, ఖమ్మం పీఠం జనరల్‍ మహిళ
  • త్వరలో ఎన్నికలకు వెళ్లేలా అడుగులు

వరంగల్/ ఖమ్మం, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్​ కార్పొరేషన్​ మరో నాలుగు రోజుల్లో ఆఫీసర్ల పాలనలోకి రానుంది. 2021 మే 7న మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం ఏర్పడగా, ఈనెల 6న పాలన గడువు ముగియనుంది. ఆ తర్వాత రోజే ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్ (కేఎంసీ) పాలకవర్గం గడువు కూడా ముగుస్తుంది. అయితే, రెండుచోట్లా కొత్త పాలకవర్గాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అధికారులు ఇప్పటివరకు అవసరమైన ఎన్నికల కసరత్తు మొదలుపెట్టలేదు.

దీంతో ఆ ప్రక్రియ జరిగి కొత్త పాలకవర్గం వచ్చేవరకు మున్సిపాలిటీల పాలన కలెక్టర్లు లేదా ఇన్​చార్జి ఆఫీసర్ల చేతిలోకి వెళ్లనున్నది. కాగా, హనుమకొండ కలెక్టర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ ప్రస్తుతం గ్రేటర్ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‍గా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆమెకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పజెబుతారా లేదంటే మరొకరికి ఇన్చార్జిగా ఇస్తారో తెలియాల్సి ఉంది. 

డివిజన్ల పెంపుపై క్లారిటీ వచ్చాకే ఎన్నికలు..

జీడబ్ల్యూఎంసీ పరిధిలోని గ్రేటర్ వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో దాదాపు 11 లక్షల జనాభా ఉంది. ప్రధానంగా వరంగల్‍ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల రూపంలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. 66 డివిజన్లు, మరో 42 విలీన గ్రామాల పరిధిలో 407.70 స్కేర్‍ మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అయితే, పాలనాసౌలభ్యం కోసం జీడబ్ల్యూఎంసీని 66 డివిజన్ల నుంచి 100 డివిజన్లకు పెంచే అవకాశాలు ఉండగా, కేఎంసీలో 60 డివిజన్లు ఉండగా మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈసారి గ్రేటర్‍ వరంగల్‍ మేయర్‍ పీఠం జనరల్‍ కాగా, ఖమ్మం మేయర్​ పీఠం మరోసారి జనరల్​ మహిళకు ఖరారు చేశారు. ఖమ్మంలో  పాత డివిజన్ల వారీగా ఎన్నికలకు వెళ్తే ఏ వర్గానికి ఎన్ని డివిజన్లు వస్తాయో కేటాయించారు. మొత్తం 60 డివిజన్లు ఉండగా, అన్ రిజర్వుడు 32 డివిజన్లు, బీసీలకు 20, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒక డివిజన్​ కేటాయించారు. మొత్తం డివిజన్లలో సగం మహిళలకు కేటాయిస్తారు. ఎలక్షన్లు నిర్వహించాలంటే డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. దీనిపై క్లారిటీ వచ్చాక జులై లేదా ఆగస్ట్​లో ఎన్నికలకు అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.