- ఏం చేయలేమని చేతులెత్తేసిన్రు
- చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్ల తీరు
- మరో హాస్పిటల్కు తీసుకువెళ్లగా బిడ్డ మృతి..తల్లి పరిస్థితి విషమం
చేవెళ్ల, వెలుగు : డెలివరీ చేస్తున్నామని టైం పడుతుందని చెబుతూ వచ్చిన డాక్టర్లు కడుపులో బిడ్డ సగం బయటకు వచ్చాక చేతులెత్తేశారు. తమ వల్ల కావడం లేదని చెప్పడంతో వేరే దవాఖానాకు తీసుకువెళ్లారు. అక్కడ బిడ్డ చనిపోగా, తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లాడ గ్రామానికి చెందిన మేఘమాలకు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11గంటలకు చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాకు తీసుకువచ్చారు.
ఆపరేషన్థియేటర్లోకి తీసుకువెళ్లిన డాక్టర్లు గంటలు గడుస్తున్నా ఏమీ చెప్పలేదు. మధ్యలో ఏమైందని అడిగినప్పుడల్లా అరగంటలో అయిపోతుందని చెబుతూ వచ్చారు. చివరకు మధ్యాహ్నం రెండు గంటలకు శిశువును సగం బయటకు తీశామని, ఇక తమ వల్ల కావడం లేదని చెప్పారు. దీంతో మేఘమాల బంధువులు ఆమెను అలాగే మొయినాబాద్ మండలంలోని భాస్కర జనరల్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు సగం బయటకు వచ్చిన బిడ్డను బయటకు తీయగా చనిపోయింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఆగ్రహించిన బాధితురాలి బంధువులు మృత శిశువుతో చేవెళ్ల దవాఖానాకు వచ్చి ఆందోళన చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో వెళ్లిపోయారు.
