
- జోర్డాన్‌లో చిక్కుకున్న కార్మికులకు హరీశ్ ఫోన్
హైదరాబాద్, వెలుగు: జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది కార్మికులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫోన్ చేశారు. ఆందోళన చెందొద్దని, తెలంగాణకు తిరిగి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని సూచించారు. ‘‘మీ ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లాం.
మా ఎంపీలు విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ఎలాగైనా మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం’’ అని ఆయన వారికి చెప్పారు. అయితే, అక్కడ బతకడానికి కనీసం చేతుల్లో డబ్బులు కూడా లేవని, తిరిగి వచ్చేందుకు కంపెనీ అనుమతి కూడా ఇవ్వడం లేదని హరీశ్ రావుకు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.