టిమ్స్, హెల్త్ సిటీ పనులు ముందుకు కదలట్లే : హరీశ్

టిమ్స్, హెల్త్ సిటీ పనులు ముందుకు కదలట్లే : హరీశ్
  • వేగంగా పూర్తి చేయాలి: హరీశ్

హైదరాబాద్, వెలుగు: కరోనా తర్వాత ముందుచూపుతో నాలుగు టిమ్స్ ఆసుపత్రులను కేసీఆర్ నిర్మించాలనుకున్నారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు ముందుకు కదలడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. టిమ్స్​లతో పాటు వరంగల్ హెల్త్ సిటీ పనులనూ కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. అన్ని నిధులు కేటాయించి భూసేకరణ, టెండర్లు, డిజైన్లన్నింటినీ పూర్తి చేశారని పేర్కొన్నారు. 

శనివారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఎల్బీ నగర్​లో నిర్మిస్తున్న టిమ్స్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎల్బీ నగర్ టిమ్స్​లో సెల్లార్​తో కలుపుకొని 6 అంతస్తుల భవనం పనులను బీఆర్ఎస్ పూర్తి చేసిందన్నారు. బీఆర్ఎస్​ అధికారంలో ఉండి ఉంటే ఆసుపత్రి ఇప్పటికే ప్రారంభమై ఉండేదన్నారు. హైదరాబాద్ టిమ్స్ తో పాటు వరంగల్ హెల్త్ సిటీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో రాష్ట్రం వెనక్కు పోతున్నదని విమర్శించారు. కేసీఆర్​ 450 బస్తీ దవాఖానలను ప్రారంభిస్తే.. అందులో పనిచేసే డాక్టర్లు, స్టాఫ్​ నర్సులు, ఉద్యోగులకు ఆరు నెలల నుంచి కాంగ్రెస్​ ప్రభుత్వం జీతాలివ్వడం లేదని ఆరోపించారు.