
- చలో సెక్రటేరియెట్‌కు మద్దతిస్తున్నమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలపై అసెంబ్లీ లోపల, బయట పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది జాబ్ క్యాలెండర్ కాదని, దగా క్యాలెండర్ అని మండిపడ్డారు. మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీ అయిందని విమర్శించారు. జులై 4న నిరుద్యోగులు చేపట్టనున్న చలో సెక్రటేరియెట్ కార్యక్రమానికి పూర్తి మద్దతునిస్తున్నామన్నారు.
తెలంగాణ భవన్లో శనివారం పలువురు విద్యార్థులు, నిరుద్యోగులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో 1.62 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. మేము ఉద్యోగాలివ్వలేదని రేవంత్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. మేము అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తేనే.. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు. అది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్‌లెస్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న నోటిఫికేషన్లు ఇప్పటికీ ఇవ్వలేదు.
ఎస్పీడీసీఎల్, ఫారెస్ట్, గ్రూప్స్, డీఎస్సీ, పోలీసు ఇలా అన్ని శాఖల్లోనూ పోస్టుల భర్తీ అని జాబ్ క్యాలెండర్ లో చెప్పారు. కానీ.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 20 నెలల్లో రేవంత్ ఇచ్చిన ఉద్యోగాలు 12 వేలు కూడా దాటలేవు’’అని హరీశ్ అన్నారు. సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని రాహుల్ గాంధీ నిరుద్యోగులకు మాట ఇచ్చారని, 2 లక్షల ఉద్యోగాలు అన్న మాట తప్పారని విమర్శించారు. సోనియా, రాహుల్, ప్రియాంక అందరూ నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.