న్యూఢిల్లీ:
ఇండియా విమెన్స్ టీమ్‌కు వరల్డ్ కప్ అందించి సరికొత్త చరిత్ర సృష్టించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆ భావోద్వేగభరిత క్షణాల నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ చారిత్రక విజయం అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ఆటగాడిగా ఎదగలేకపోయిన తన తండ్రి క్రికెట్ బ్యాట్‌ను చిన్నప్పుడు పట్టుకున్నప్పుడే ఈ కల మొదలైందని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ‘కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు. విధి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు’ యంగ్ క్రికెటర్లకు ఆమె సందేశం ఇచ్చింది.
నాన్న చెక్కిన బ్యాట్ తో..
బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో హర్మన్ తన బాల్యాన్ని గుర్తుచేసుకుంది. ‘నాకు గుర్తుతెలిసినప్పటినుంచీ నా చేతిలో బ్యాట్ ఉండేది. మా నాన్న కిట్ బ్యాగ్‌లోని బ్యాట్‌తోనే ఆడుకునేవాళ్లం. ఆ బ్యాట్ చాలా పెద్దగా ఉండేది. ఒకరోజు నాన్న తన పాత బ్యాట్లలో ఒకదాన్ని చెక్కి, నాకోసం ఒక చిన్న బ్యాట్‌గా తయారు చేశారు. మేమంతా దానితో ఆడుకునేవాళ్లం. టీవీలో ఇండియా మ్యాచ్ లేదా వరల్డ్ కప్ చూస్తున్నప్పుడు నాకూ ఇలాంటి అవకాశం రావాలని నేను అనుకునేదాన్ని. నిజం చెప్పాలంటే, ఆ సమయంలో నాకు అమ్మాయిల క్రికెట్ గురించి కూడా తెలియదు’ అని వెల్లడించింది.
హర్మన్‌ప్రీత్ తండ్రి, హర్మందర్ సింగ్ భుల్లర్, పంజాబ్‌లోని మోగాలో జ్యుడీషియల్ కోర్టులో క్లర్క్‌గా పనిచేసేవారు. తను కూడా యంగ్ ఏజ్‌లో క్రికెట్, ఫుట్‌బాల్ ఆడినా ఫ్రొఫెషనల్ స్థాయికి వెళ్లలేకపోయారు. తాను సాధించలేనిది తన కూతురు హర్మన్ ద్వారా సాకారం చేసుకోవాలని హర్మందర్ కోరుకున్నారు. అతను అందించిన సంపూర్ణ మద్దతుతో మొదలైన హర్మన్ ప్రయాణం, ఆదివారం అందుకున్న వరల్డ్ కప్ ట్రోఫీతో శిఖరానికి చేరింది.
అంతా మ్యాజిక్ లా ఉంది
వరల్డ్ చాంపియన్‌గా నిలిచి తన చిన్ననాటి కల నెరవేరడంతో ఇప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తోందని హర్మన్ చెప్పింది. ‘చిన్నప్పుడు ఈ బ్లూ జెర్సీ ఎప్పుడు వేసుకుంటానా అని కలలు కనేదాన్ని. విమెన్స్ క్రికెట్ గురించి ఏమాత్రం తెలియని ఒక చిన్నారి, మన దేశంలో ఒక మార్పు తీసుకురావాలని కల కంది. ఆ కలలే నిజమయ్యాయి. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా భావోద్వేగభరితమైన క్షణం. ఎందుకంటే, ఇది నా చిన్ననాటి కల. క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి, ఏదో ఒక రోజు వరల్డ్ కప్ గెలవాలని బలంగా కోరుకున్నా.
జట్టుకు నాయకత్వం వహించే అవకాశం వస్తే, దాన్ని అస్సలు వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇవన్నీ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దేవుడు నా కోరికలన్నీ ఒక్కొక్కటిగా నిజం చేశాడు. ఇదంతా ఒక మ్యాజిక్ లా ఉంది. అన్నీ ఎలా కుదిరాయో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు మేం వరల్డ్ చాంపియన్లం. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఆ దేవుడికి నేను చాలా రుణపడి ఉన్నాను’ అని పేర్కొంది.
2017 ఓటమి.. మమ్మల్ని కదిలించింది
2017 వరల్డ్ కప్ ఫైనల్‌ను కూడా హర్మన్‌ప్రీత్ గుర్తుచేసుకుంది. ఆనాడు మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని జట్టులో హర్మన్, స్మృతి, దీప్తి వంటి ప్రస్తుత సీనియర్లు సభ్యులుగా ఉన్నారు. ‘లండన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఆ ఫైనల్లో మేము 9 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఆ పరాజయంతో మా గుండె పగిలిపోయింది. గెలుపు మా చేతుల్లోనే ఉన్న ఆ మ్యాచ్ ఎలా ఓడిపోయామో మాకు అర్థం కాలేదు. కానీ ఓడిపోయి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడి అభిమానులు మాకు అందించిన స్వాగతం, ప్రేరణ మమ్మల్ని కదిలించింది.
అప్పుడే మాకు అర్థమైంది... కేవలం మేము మాత్రమే కాదు, యావత్ దేశం అమ్మాయిల క్రికెట్ ఏదో ఒక అద్భుతం చేయాలని, దేశం గర్వపడేలా ఏదో సాధించాలని ఎదురుచూస్తోందని. అప్పటినుంచి ప్రతి ఒక్కరూ ఈ క్షణం (వరల్డ్ కప్ విక్టరీ) కోసమే ఎదురుచూశారు. అందరి ఆశీస్సులు, ప్రార్థనల వల్లే మేము ఈ విజయాన్ని అందుకోగలిగాం. స్టేడియంలో మేము ఒంటరిగా ఆడలేదు. స్టేడియంలోని ప్రేక్షకులు, టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది... అందరూ మాతో కలిసి ఈ విజయం సాధించారు. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు’ అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది.
