ఎంతటి బలవంతునికైనా తొందరపాటు పనికిరాదు..: సింహం-కుందేలు కథ ఇచ్చే సందేశం...

 ఎంతటి బలవంతునికైనా తొందరపాటు పనికిరాదు..: సింహం-కుందేలు కథ ఇచ్చే సందేశం...

ఎంతటి బలం కలిగిన సింహమైనా ఏమరుపాటుగా ఉండి తనను తాను రక్షించుకోలేకపోతే, ఒక చిన్న నక్క చేతిలో కూడా మోసపోయి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది.  యుద్ధ రంగంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే, ఆ శిఖండి చేతిలో మనం భీష్ముడిని కోల్పోవలసి వస్తుంది. నిద్రిస్తున్న పెద్దపులిని గొర్రె వధించినట్లవుతుంది... అని దుర్యోధనుడు భీష్ముడి రక్షణ గురించి తన సైన్యానికి సూచించాడు. కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధులవుతూ.. దుర్యోధనుడు భీష్ముని పరాక్రమం గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో ఈ మాటలు పలుకుతాడు.

ఎంతటి బలవంతునికైనా నిరంతరం అప్రమత్తత చాలా అవసరం. రాజకీయ నాయకులు లేదా బలవంతులు తమ ఏమరుపాటు వల్ల తమ కంటే బలహీనులైన శత్రువుల చేతిలో ఓడిపోతారని ఈ పద్యం హెచ్చరిస్తోంది.

భీష్ముడు గొప్ప యోధుడు. ఆయన ముందు సాక్షాత్తు పరశురాముడు కూడా నిలవలేకపోయాడు. అంతటివాడైన భీష్ముడు ‘నాకు శిఖండి ఎదురు వస్తే నేను యుద్ధం చేయను. ఆ అదను చూసి శత్రువు నన్ను సంహరిస్తాడు’ అని తన మరణ విషయాన్ని దుర్యోధనుడితో పలికాడు. అందువల్లనే భీష్ముడి విషయంలో అత్యంత జాగ్రత్త వహించమని తన సోదరులకు, సైన్యానికి సూచించాడు దుర్యోధనుడు. శిఖండి ఎదురుపడకుండా భీష్ముడికి అడ్డుగా నిలబడమని సూచించాడు. ఎంత జాగ్రత్త వహించిన ఏదో ఒక క్షణం అజాగ్రత్త అనేది తప్పదు. ఆ అజాగ్రత్త సమయంలోనే శిఖండి ఎదురుపడ్డాడు. భీష్ముడు యుద్ధం విరమించాడు. అర్జునుని బాణాలతో నేలకొరిగాడు.

చీమ - పాము
పాముకి దాని మీద దానికే అపరిమిత విశ్వాసం ఉంది. ‘నన్ను చూస్తే అందరికీ భయం. నేను కాటు వేస్తే అందరూ చనిపోతారు. నా అంతటి బలవంతులు మరొకరు లేరు’ అని భావన చేసి ఏమరుపాటుగా నిద్రించిందట. అంతే చలిచీమలన్నీ పాము చుట్టూ చేరి, ఆ పామును చంపేశాయట. 

►ALSO READ | ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఆపే బెస్ట్ మార్గాలు ఇవే.. మళ్ళి రమ్మన్న రావు...

‘‘బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’’  పాము ముందు చీమలు అతి చిన్న ప్రాణులు. పాము అప్రమత్తంగా లేకపోవడం వల్లే చీమలు పామును చంపగలిగాయి. 

సింహము - కుందేలు
‘పంచతంత్రం’లోని సింహము- కుందేలు కథ తెలిసిందే కదా. సింహం అడవికి రాజు. అత్యంత క్రూర జంతువు. రోజుకో జంతువు సింహానికి ఆహారంగా స్వచ్ఛందంగా రావాలి. రోజుకో ప్రాణి సింహానికి ఆహారంగా బలవుతున్నాయి. ఆ రోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలుకి చనిపోతాననే భయం కలిగింది. ఎలాగైనా చావు నుంచి తప్పించుకోవాలనుకుంది. బాగా ఆలోచన చేసింది. కుందేలు రావటం ఆలస్యమవుతోంది. ఆకలితో ఉన్న సింహానికి కోపం రెట్టింపయ్యింది. కుందేలు కావాలనే సింహం దగ్గరకు ఆలస్యంగా వచ్చింది. 

‘ఆలస్యంగా ఎందుకు వచ్చావు’ అని గట్టిగా గర్జించింది సింహం. కుందేలు అల్ప ప్రాణి, సాధు జీవి. సింహం అరుపులకు బెదిరిపోవాలి. కాని కుందేలు సింహం బారి నుంచి తన ప్రాణాలు రక్షించుకోవటమే కాకుండా, సింహం చనిపోయేలాగ ఒక ఉపాయం పన్నింది. ‘మృగరాజా! మీకో విషయం చెప్పాలి. నేను వచ్చే దారిలో మరో సింహం కనిపించింది. తానే అడవికి రాజునని చెప్పింది’ అని వినయంగా పలికింది కుందేలు. అందుకు సింహం కోపంగా, ‘ఆ సింహం ఎక్కడుందో నాకు చూపించు. ఈ అడవికి నేనే రాజుని. నేనుండగా ఈ అడవికి మరొకరు రాజు ఎలా అవుతారు’ అని కోపంగా పలికింది. వెంటనే కుందేలు, ‘మహారాజా! ఆ సింహాన్ని మీకు చూపిస్తాను’ అని సింహాన్ని.. ఆ అడవి మధ్యలో ఉన్న పాడుబడిన బావి దగ్గరకు తీసుకువెళ్లింది. ‘మహారాజా! ఈ బావిలో ఉంది చూడండి’ అంది. బావిలోకి చూడగానే తన నీడ కనిపించింది. ఆ నీడను మరో సింహంగా భావించింది. ఏ మాత్రం జాగ్రత్తగా లేకుండా ఏమరుపాటు కారణంగానే  అలా భావించింది అంతటి క్రూర జంతువైన సింహం. ఒక్క క్షణం కూడా  ఆలోచించకుండా ఆ సింహాన్ని చంపాలనే ఆవేశంతో, బావిలోకి దూకేసింది. ఎంతటి బలవంతులైనా అప్రమత్తంగా ఉండకపోతే ఓటమి తప్పదు.

- డా. పురాణపండ వైజయంతి