విద్యార్థుల ఇంటి ముందు హెడ్మాస్టర్ నిరసన

విద్యార్థుల ఇంటి ముందు హెడ్మాస్టర్ నిరసన

సంగారెడ్డి జిల్లా: విద్యార్థులు స్కూలుకు రాకపోవడంతో ఓ హెడ్మాస్టర్ వినూత్న తరహాలో నిరసన తెలియజేసి చదువుకోమంటూ పిల్లలకు.. పిల్లలను బడికి పంపమంటూ తల్లిదండ్రులను వేడుకున్నారు. రాష్ట్రంలో మూడు రోజుల క్రితం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. పుల్కల్ మండలం ముదిమాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల విద్యార్థులు అంతంతమాత్రంగానే హాజరవుతున్నారు. చాలా మంది స్కూలుకు రావడానికి ఆసక్తి చూపకపోవడంతో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులే పిల్లల ఇళ్లకు బయలుదేరారు. 
బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చదువు విలువ తెలియజేసేందుకు హెడ్మాస్టర్ నూలి శ్రీధర్ రావు, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలసి గ్రామంలో ఇంటింటికీ తిరగడం ప్రారంభించారు. ముఖ్యంగా బడి మానేస్తున్న వారి గురించి వాకబు చేశారు. గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ సారి 9వ తరగతిలో చేరేందుకు రావాల్సి ఉండగా రావడం లేదని గుర్తించారు. బాల కార్మికులుగా మారుతున్నారని.. మరికొందరు అనారోగ్యంతో రావడం లేదని తెలుసుకుని వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు. ఎలాగైనా బడికి పంపాల్సిందేనంటూ విద్యార్థుల ఇండ్ల వద్దనే బైఠాయించి.. వారి ఇళ్ల నేల పడుకుని నిరసన తెలియజేశారు. జీవితంలో చదువు చాలా అవసరమని.. చదువు విజ్ఘానాన్ని పెంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. పేదరికంలో పుట్టడం మన తప్పు కాదని.. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు చదువు చక్కటి సాధనమంటూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించే ప్రయత్నం చేశారు. విద్య పంచేకొద్దీ పెరుగుతుందని.. మన నుండి ఎవరూ దొంగలించలేనిది విద్య మాత్రమేనని తెలియజేశారు. ప్రభుత్వం కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. హెడ్మాస్టర్, ఉపాధ్యాయుల ప్రయత్నాలు ఫలించి కొంత మంది విద్యార్థులు తిరిగి బడికి వెళ్లేందుకు అంగీకరించారు.