మండుటెండల్లో తుంగభద్రకు భారీ వరద

మండుటెండల్లో తుంగభద్రకు భారీ వరద

80 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌‌ఫ్లో.. శ్రీశైలం, సుంకేసులకు పెరిగిన వరద

హైదరాబాద్‌‌, వెలుగు: మండుటెండల్లో తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. కొద్దిరోజులుగా కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర నది ఉప్పొంగుతోంది. సోమవారం ఉదయం తుంగభద్ర ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో రాగా, మధ్యాహ్నం తర్వాత అది 80 వేల క్యూసెక్కులకు పెరిగింది. లోకల్‌‌ క్యాచ్‌‌మెంట్‌‌లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా 10 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌‌ఫ్లో వస్తోంది. సుంకేసుల బ్యారేజ్​కు కూడా 13 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో నీటిని నిల్వ చేసే ఆస్కారం లేక హైలెవల్‌‌, లో లెవల్‌‌ కాల్వల ద్వారా నీటిని వదిలేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ఇంకో వారం రోజులు ఉండగా, ఈ ఏడాది వర్షాలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్తోంది. ఒకవేళ వర్షాలు ఆలస్యమైనా ఇప్పుడు వస్తున్న వరదలతో దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తప్పుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా బేసిన్‌‌లో నాగార్జునసాగర్‌‌, గోదావరి బేసిన్‌‌లో సింగూరులో తప్ప రాష్ట్రంలోని మిగతా ఏ ప్రాజెక్టులోనూ ఆశించిన స్థాయిలో నీళ్లు లేవు. దీంతో ఈ ఏడాది ఆయా ప్రాజెక్టులు నిండడానికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశముందని ఇంజనీర్లు చెప్తున్నారు.