మెదక్ ను ముంచుతున్న మహబూబ్ నహర్ కాల్వ

మెదక్ ను ముంచుతున్న మహబూబ్ నహర్ కాల్వ
  • భారీ వర్షం పడితే మెదక్​లో పలు కాలనీలు జలమయం
  • చెరువులా మారుతున్న మెయిన్​ రోడ్డు

మెదక్, వెలుగు: భారీ వర్షం పడితే చాలు మెదక్ పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు వణికి పోతున్నారు. ఐదారు సెంటీమీటర్లకు మించి వర్షం పడితే చాలు పట్టణ పరిధిలోని సాయినగర్​ కాలనీ, గాంధీనగర్ కాలనీ జలమయమవుతున్నాయి. పట్టణం మధ్యలో నుంచి వెళ్తున్న మహబూబ్​నహర్​ కాల్వ సాయినగర్​ కాలనీని ముంచెత్తుతోంది. 

దీంతో ఆ కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాల్వ నీరంతా సమీపంలోని ఆటోనగర్​ కాలనీ మెయిన్​ రోడ్డుపైకి చేరుతోంది. దీంతో ఆ రూట్​లో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. రోడ్డు పక్కన ఉన్న షాప్​లలోకి సైతం నీరు చేరుతోంది. 

షాప్​లలోకి నీరు..

భారీ వర్షం కురిసినప్పుడల్లా పట్టణంలో ప్రధాన రహదారి అయిన ఎంజీ రోడ్డు, రాందాస్ చౌరస్తా, ఫతేనగర్ రోడ్డు చెరువులా మారుతున్నాయి. ఎంజీ రోడ్డులో, మున్సిపల్ కాంప్లెక్స్ లో షాప్ ల లోకి నీరు చేరుతోంది. గడిచిన వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు ఈ పరిస్థితి నెలకొంది.  షాప్​లలోకి నీరు చేరడంతో సామగ్రి తడిసి పోయి నష్టం వాటిళ్లుతోందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కారణమేంటంటే..

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కాలనీలు, రోడ్లు జలమయమవుతున్నాయి. సరైన లెవల్స్​ తీసుకోకుండా ఇష్టారీతిగా డ్రైనేజీలు నిర్మించడం, పలు చోట్ల వాటికి ఔట్​లెట్స్​లేకపోవడం, మెయిన్​ రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు చెత్తా చెదారం డ్రైనేజీలోకి తోసేయడంతో మురుగు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి రోడ్లు  జలమయం కావడానికి, షాప్​లలోకి నీరు చేరడానికి కారణమవుతున్నాయి. 

కలెక్టర్​ పర్యవేక్షణ

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్​ రాహుల్​ రాజ్​ఇటీవల పట్టణంలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా  పరిష్కార మార్గాలు అన్వేషించి తక్షణ సహాయక చర్యలపై దృష్టిపెట్టారు. మురికి కాల్వల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.