వాహనదారులు అలర్ట్ .. ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్..

వాహనదారులు అలర్ట్ .. ఈ  రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్ లో  కురిసిన కుండపోత వర్షానికి  హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డికాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయిన జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, హైటెక్ సిటీ నుంచి లింగంపల్లి వరకు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

సెప్టెంబర్ 22న ఇవాళ ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వాతావరణం మారిపోయి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి.  తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో  నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్

హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో  మరో  2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాత్రి 10  గంటల వరకు భారీ వర్షం కురుస్తుందని అధికారులు ప్రకటించారు.  గంటకు 41 -61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో (గాలులు వీచే) మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం ఉంది.  అందువలన ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.