సిజేరియన్ల దందా ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం

సిజేరియన్ల దందా ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం
  • ఒక్కో  సిజేరియన్​కు రూ.70 వేల నుంచి లక్ష వరకు ఫీజు 
  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90 శాతం, సర్కారు ఆస్పత్రుల్లో 56 శాతం సిజేరియన్లు

సిద్దిపేట, వెలుగు: కాసుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నాయి. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నా గర్భిణిలకు  సిజేరియన్లు చేసి డబ్బులు దండుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని  సూచిస్తున్నా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు దీన్ని తుంగలో తొక్కుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90 శాతం, సర్కారు ఆస్పత్రుల్లో 56 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి.  

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక్కో  సిజేరియన్ కు రూ.70 వేల నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్​నుంచి ప్రస్తుతం వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 9186 డెలివరీలు జరిగితే అందులో 4 వేలు నార్మల్, 5186 సిజేరియన్లు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 56.8 శాతం సిజేరియన్లు మాత్రమే జరుగుతున్నాయి.  సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో మొత్తం 4040 డెలివరీల్లో 1936 నార్మల్, 2104 సిజేరియన్లు, గజ్వేల్ మాతా శిశు ఆస్పత్రిలో మొత్తం 4012 డెలివరీల్లో 1675 నార్మల్, 2337 సిజేరియన్లు ఉన్నాయి. జిల్లాలోని 40 ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొత్తం 4174 డెలివరీలు జరిగితే ఇందులో కేవలం 488 నార్మల్ డెలివరీలు కాగా 3686 సిజేరియన్లు చేశారు. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో తక్కువగా జరిగితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయి. 

తెల్ల కాగితంపై ఫీజుల వివరాలు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెలీవరీల కోసం వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. చీటీలపై ఫీజులను నమోదు చేసి వసూలు చేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో నెలకు వందల సంఖ్యలో డెలివరీలు జరుగుతుంటే అందులో 95 శాతానికి పైగా సిజేరియన్లు ఉంటున్నాయి. ఆయా ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల ప్రకారం ఫీజుల బోర్డులను ఏర్పాటు చేయడంలేదు. నెలకు కోట్లల్లో టర్నోవర్ జరుగుతున్నా ఆర్థిక లావాదేవీలను పరిశీలించే ప్రభుత్వ సంస్థలు వీటిపై దృష్టి పెట్టడం లేదు. 

మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులిచ్చే కమీషన్ల కోసం కొందరు ఆఫీసర్లు కక్కుర్తి పడుతున్నారు. సిద్దిపేట, నారాయణ రావుపేట మండలాల్లోని పలు గ్రామాల నుంచి గర్భిణిలను సిద్దిపేట పట్టణంలోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆర్ఎంపీ, పీఎంపీలే ఇలా చేస్తారని తెలుసు కానీ ఇటీవల వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కొందరు సిబ్బంది సైతం ఈ దందా చేస్తున్నట్లు సమాచారం. 

నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు

నార్మల్ డెలివరీ జరగడానికి అవకాశం ఉన్న గర్భిణిలకు సిజేరియన్లు చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నార్మల్ డెలివరీలు ఎక్కువగా చేయాలని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. డెలివరీల వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయానికి అందించాలని సూచించాం.  ప్రైవేట్ ఆస్పత్రులకు గర్భిణిలు వెళ్లేలా సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం.- పల్వన్ కుమార్, డీఎంహెచ్​వో, సిద్దిపేట