నాగర్​కర్నూల్​ జడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక చెల్లదు

నాగర్​కర్నూల్​ జడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక చెల్లదు
  • ముగ్గురు పిల్లలున్నందున.. జడ్పీటీసీగా అనర్హురాలంటూ హైకోర్టు తీర్పు  
  • కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించాలని ఆదేశం

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి జడ్పీటీసీ ఎన్నిక చెల్లదని సోమవారం హైకోర్టు తీర్పు ప్రకటించింది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెల్కపల్లి మండలం నుంచి జడ్పీటీసీగా గెలిచిన పద్మావతికి ముగ్గురు సంతానం ఉన్నట్లు ప్రూవ్ కావడంతో ఆమె ఎన్నిక చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర గెలిచినట్లుగా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఎన్నికల్లో పద్మావతి టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఆధారాలతో సహా స్ర్కూటినీకి ముందే ఎన్నికల ఆఫీసర్​కు కంప్లయింట్ చేసినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో పద్మావతి గెలవడంతో ఆమెపై సుమిత్ర జిల్లా ఎలక్షన్ ట్రిబ్యునల్​లో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ట్రిబ్యునల్.. పద్మావతి ఎన్నిక చెల్లదని ఈ ఏడాది జులై 15న తీర్చు ఇచ్చింది.

కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించాలని జిల్లా ఎలక్షన్ అథారిటీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై పద్మావతి హైకోర్టులో అప్పీల్ చేశారు. విచారణ అనంతరం హైకోర్టు కూడా సోమవారం ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. అయితే, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తారా? లేదంటే హైకోర్టు ఫుల్ బెంచ్ ముందు అప్పీల్ పిటిషన్ కు చాన్స్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. పద్మావతి ఫుల్ బెంచ్​కు అప్పీల్ చేయని పక్షంలో ఆమె వారసులుగా జడ్పీ చైర్మన్​ పోస్ట్​కు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్ ఎంపీ పి. రాములు కొడుకు), ఊర్కొండ జడ్పీటీసీ శాంతకుమారిలో ఒకరికి చాన్స్​వస్తుందని చెప్తున్నారు. పద్మావతి అప్పీల్ కు వెళ్లకపోతే వారం రోజుల్లోనే కాంగ్రెస్ నుంచి గెలిచిన సుమిత్ర చేత జడ్పీటీసీగా ప్రమాణం చేయించడంతో పాటు కొత్త చైర్మన్ ఎంపిక చేపట్టాల్సి ఉంటుంది.