స్పా సెంటర్లపై..దాడిచేసే అధికారం ఎస్ఐలకు లేదు..హైకోర్టు

స్పా సెంటర్లపై..దాడిచేసే అధికారం ఎస్ఐలకు లేదు..హైకోర్టు
  • తీర్పు వెలువరించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: స్పా సెంటర్లపై దాడి చేసే అధికారం ఎస్‌ఐ స్థాయి అధికారికి లేదని, సీఐ ఆపైస్థాయి అధికారి మాత్రమే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మనుషుల అక్రమ రవాణా నివారణ చట్టంలోని సెక్షన్‌ 13 ఇదే విషయాన్ని నిర్దేశిస్తున్నదని తెలిపింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నమోదు చేసిన కేసు చట్టప్రకారం చెల్లదని తీర్పు చెప్పింది. 

స్పా ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని, మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్‌ఐ దాడి చేసి మొబైల్‌ ఫోన్లు, వినియోగించని కండోమ్‌లను స్వాధీనం చేసుకుని కేసు పెట్టడాన్ని స్పా మేనేజర్‌ అయిన ఒక మహిళ హైకోర్టులో సవాల్‌ చేశారు. 

మహిళ భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎస్‌ఎస్‌ఎస్‌) సెక్షన్‌ 528 కింద కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ ను జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ జూకంటి విచారించి ఇటీవల పై తీర్పు వెలువరించారు. ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నందున కేసు కొట్టివేయవద్దని పోలీసుల తరఫున న్యాయవాది కోరారు. 

దర్యాప్తు కొనసాగితే స్పా సెంటర్‌ మోసాలు బయటకు వస్తాయని తెలిపారు. దీనిపై హైకోర్టు.. అభియోగాలు తీవ్రమైనప్పటికీ దానిపై చర్యలు చట్ట ప్రకారం ఉండాలని చెప్పింది. ఇన్‌స్పెక్టర్‌ లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉండే ప్రత్యేక అధికారికి మాత్రమే ఈ చట్టం కింద చర్య తీసుకునే అధికారం ఉందని తేల్చి చెప్పింది. 

స్పా సెంటర్‌పై కేసు కొట్టివేసింది. అక్రమ రవాణా నిరోధం కేసుల దర్యాప్తునకు సీఐ అంత కంటే పైస్థాయి అధికారులతో ప్రత్యేక అధికారులను నియమించాలని డీజీపీని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.