
- పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు నమోదు చేసిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు గురువారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని, దీనికి సహకరించాలని కౌశిక్‌రెడ్డిని ఆదేశించింది. రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్‌రెడ్డి తన భర్తను బెదిరించారంటూ క్వారీ యజమాని మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయడంతో హనుమకొండ పోలీ సులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్ రెడ్డి హైకో ర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని, 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనకుండా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ.. క్వారీ యజమానిని గతంలో బెదిరించి డబ్బు వసూలు చేశారన్నారు. మళ్లీ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయ డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుం టూ.. బెదిరింపులకు పాల్పడిన వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. క్వారీ యజమాని కాకుండా ఆయన భార్య ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అడిగారు. వీటిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు కోర్టు నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేసింది.