సామాన్యుడికి సత్వర న్యాయం అందించాలి

సామాన్యుడికి సత్వర న్యాయం అందించాలి
  • జిన్నారంలో జూనియర్ కోర్టును ప్రారంభించిన న్యాయమూర్తులు
  • హాజరైన కలెక్టర్  ప్రావీణ్య , ఎస్పీ పరితోశ్ పంకజ్

జిన్నారం, వెలుగు: సామాన్యుడికి సత్వర న్యాయం అందించాలని హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నంద సూచించారు. ఆదివారం జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టును జూకంటి అనిల్ కుమార్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి మహానుభావులు లా చదివి దేశాన్ని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించారని, అలాంటి వృత్తిలో ఉన్నందుకు గర్వపడాలన్నారు.

 పేదలకు, వీకర్ సెక్షన్స్ కు న్యాయం అందించే విధంగా బార్  కౌన్సిల్  పనిచేయాలన్నారు. జిల్లా జడ్జి  భవానీ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో 17 కోర్టులు పనిచేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా సంగారెడ్డి, జహీరాబాద్, జిన్నారంలో కోర్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిన్నారం కోర్టుకు 2210 కేసులను ట్రాన్స్​ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ప్రారంభించినప్పటికీ కోర్టు భవనం కోసం ఐదెకరాల స్థలాన్ని పరిశీలించినట్లు అందులో త్వరలో కొత్త భవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.