కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి : జడ్జి పుల్ల కార్తీక్

కక్షిదారులకు సత్వర న్యాయం  అందించాలి :  జడ్జి పుల్ల కార్తీక్
  • హై కోర్టు జడ్జి పుల్ల కార్తీక్

సిద్దిపేట, వెలుగు: కక్షిదారులకు సత్వర న్యాయం  అందించాలని హైకోర్ట్​ జడ్జి పుల్ల కార్తీక్​ సూచించారు. శనివారం సిద్దిపేట కోర్ట్ భవనంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు నూతనంగా నిర్మించిన 3,4 వ అంతస్తులను తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్​ విజయసేన రెడ్డి, జస్టిస్ శ్రవణ్ కుమార్ తో కలసి  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన​సిద్దిపేట సెకండ్ అడిషనల్  జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణానికి కృషి చేసిన వారిని అభినందించారు. అనంతరం జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి  మాట్లాడుతూ..  న్యాయం కోరుతూ కోర్టుకు వచ్చే ప్రజలకు అసంతృప్తిని కలిగించకూడదన్నారు. ప్రతి ఒక్క న్యాయవాది కక్షి దారులకు న్యాయం చేకూరేలా చూడాలని సూచించారు. 

జస్టిస్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకోవాలని ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉందని, రాజ్యాంగం చదివితే హక్కులు, విధుల గురించి మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంలో చురుకైన పాత్ర పోషించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. సిద్దిపేట జిల్లా వాసిగా ఈ ప్రాంతంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని రాజ్యాంగాన్ని హైస్కూల్ స్థాయి సిలబస్ లో పొందుపరచాలన్నది తన అభిప్రాయమని తెలిపారు. 

ఉత్తమ సేవలను అందించిన పలువురు కోర్టు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్  జడ్జి సాయి రమాదేవి, కలెక్టర్ హైమావతి, సీపీ అనురాధ, అడిషనల్​కలెక్టర్ గరిమ అగర్వాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ఆర్డీఓ చంద్రకళ పాల్గొన్నారు.