సంజయ్ యాత్ర అడ్డుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు

సంజయ్ యాత్ర అడ్డుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు
  • అడ్డుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు
  • వర్దన్నపేట ఏసీపీ నోటీసులు రాజ్యాంగ విరుద్ధం
  • వీడియోలున్న పెన్ డ్రైవ్ 
  • మాత్రమే ఇస్తే సరిపోతుందా?  
  • ఆ వీడియోలు ఎక్కడివో అఫిడవిట్ ఎందుకు వెయ్యలే? 
  • యాత్రను చివర్లో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నలు 
  • హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, వరంగల్ కమిషనర్, వర్దన్నపేట ఏసీపీకి నోటీసులు జారీ 

హైదరాబాద్, వెలుగు:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌‌ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యాత్రను ఆపివేయాలంటూ వర్దన్నపేట ఏసీపీ మంగళవారం ఇచ్చిన నోటీసును కోర్టు సస్పెండ్‌‌ చేసింది. యాత్రను కొనసాగనివ్వాలంటూ జస్టిస్‌‌ వినోద్‌‌కుమార్‌‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. పోలీసుల నోటీసు రాజ్యాంగ విరుద్ధమని తప్పుపట్టారు. ‘‘యాత్ర సమయంలో సంజయ్ ప్రసంగాలతో శాంతి భద్రతల సమస్య వస్తోందన్న పోలీసులు వీడియో క్లిప్పింగ్స్ ఉన్న పెన్ డ్రైవ్​ను ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆ వీడియో, న్యూస్ క్లిప్పింగ్స్ ఎక్కడివి? ఎవరు తీశారు? అన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయనందున ఆ పెన్ డ్రైవ్ ను పరిశీలించబోం” అని జడ్జి స్పష్టం చేశారు. 

అలాగే వర్దన్నపేట ఏసీపీ నోటీసుకు చట్టబద్ధత లేదని కోర్టు తేల్చిచెప్పింది. చట్ట ప్రకారం నోటీసుకు వారం రోజులే గడువు ఉంటుందని, అంతకు మించినట్లయితే గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని గుర్తు చేసింది. బీజేపీ రాష్ట్ర జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బంగారు శ్రుతి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌‌‌‌‌‌‌‌ పై ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ .. ప్రతివాదులైన హోం శాఖ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ, డీజీపీ, వరంగల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనర్, వర్దన్నపేట ఏసీపీ, ఇతరులు కౌంటర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.

యాత్రకు మాత్రమే అభ్యంతరాలా? 
పోలీసుల తరఫున అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ బీఎస్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నందుకే యాత్రను నిలిపివేస్తూ నోటీసు ఇచ్చారని చెప్పారు. యాత్రలో లోకల్‌‌‌‌‌‌‌‌ లీడర్లు శాంతి భద్రతల సమస్యలు వచ్చేలా ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ హైకమాండ్ ఒక ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఈ కారణాన్ని యాత్రకు మాత్రమే వర్తింపజేస్తున్నారా? అని ప్రశ్నించింది. ఇతరుల సమావేశాలను నిలిపివేయనప్పుడు యాత్రను మాత్రమే ఎందుకు ఆపేశారని నిలదీసింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది జె.ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వం రాజకీయ కక్షతో కావాలనే పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టించిందని చెప్పారు. పోలీసులు ఇచ్చిన పెన్‌‌‌‌‌‌‌‌డ్రైవ్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. ఎవిడెన్స్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌  ప్రకారం అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ లేకుండా సమర్పించే పెన్‌‌‌‌‌‌‌‌డ్రైవ్‌‌‌‌‌‌‌‌కు విశ్వసనీయత ఉండదన్నారు. 

చివర్లో ఎందుకు ఆపుతున్రు?   
వాదనలు విన్న తర్వాత జడ్జి స్పందిస్తూ.. ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికే రెండు విడతలు ముగిసిందని, మూడో విడత మరో మూడు నాలుగు రోజుల్లో ముగిసే దశలో పోలీసులు అడ్డుకోవడంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ‘‘ఈ నెల 2న యాదగిరిగుట్ట నుంచి మొదలైన యాత్రపై ఇప్పటివరకూ లేని అభ్యంతరం చిట్టచివర్లో పోలీసులకు ఎందుకు వచ్చింది? యాత్రకు అనుమతి కోరుతూ బీజేపీ జులై 23న డీజీపీకి వినతిపత్రం ఇచ్చింది. రాతపూర్వకంగా అనుమతి ఇవ్వలేదు. యాత్రకు అభ్యంతరం కూడా చెప్పలేదు. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికైనా నడిచి వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించింది. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ యాత్రను నిలిపివేస్తూ వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన నోటీసును సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం. ప్రతివాదుల వాదనలు విన్న తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేస్తాం” అని జడ్జి స్పష్టం చేశారు.

ఆగిన చోట నుంచే యాత్ర షురూ 
జనగామ, వెలుగు: హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 2రోజుల క్రితం ఆగిన చోట నుంచే తిరిగి ప్రారం భం కానుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరు వద్ద నుంచి శుక్రవారం ఉదయం యాత్రను తిరిగి కొనసాగించనున్నారు. గురువారం రాత్రే సంజయ్ పామునూరుకు చేరుకున్నారు. యాత్రకు హైకోర్టు అనుమతివ్వడంతో బీజేపీ క్యాడర్​లో ఫుల్ జోష్​ నెలకొంది. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే యాత్ర షురూ చేయడం మరింత ఉత్సాహాన్ని నింపింది. జన గామ జిల్లాలో 15న దేవరుప్పులలో మొదలైన యాత్ర ఆది నుంచీ టెన్షన్ వాతావరణంలోనే కొనసాగింది. జిల్లాలోకి ప్రవేశించిన తొలిరోజే టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. రోజూ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఈ నెల 23న పామునూరు- ఉప్పుగల్లు స్టేజీ మధ్యలో వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు సిద్ధం కాగా పోలీసులు బండి సంజయ్​ను అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. పాదయాత్ర విరమించుకోవాలని అదే రోజు నోటీసులు ఇవ్వగా.. గురువారం ఆ నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. 

ముగింపు సభకు జేపీ నడ్డా 
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం హన్మకొండలో ముగియనుంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్​లో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరు కానున్నారు. సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పార్టీ లీడర్లు సవాల్ గా తీసుకుంటున్నారు. అయితే, గడువు తక్కువగా ఉండడంతో పాదయాత్ర డిస్టెన్స్, షెడ్యూల్ లో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయించిన టైంకు ముగింపు సభకు చేరుకునేందుకు సంజయ్ రోజూ 20 కిలోమీటర్లకుపైగా నడవాలని నిర్ణయించుకున్నారు.