సిటీలో కుక్కలకు..  షెల్టర్ హోమ్స్ లేవ్

సిటీలో కుక్కలకు..  షెల్టర్ హోమ్స్ లేవ్
  • ఏబీసీ సెంటర్లనే షెల్టర్ హోమ్స్​అని చెప్తున్నరు 
  • అక్కడ కుక్కలకు నరకం 
  • అధ్వానమైన తిండి, వ్యాక్సిన్​కూడా సక్కగ వేస్తలేరు 
  • సుప్రీం ఆర్డర్​పాటిస్తలేరని కుక్కల తరలింపుపై హైకోర్టు స్టే
  • ఆసరా ఎన్జీవో ఫౌండేషన్​ప్రతినిధులు

పంజాగుట్ట, వెలుగు: స్ట్రీట్​ డాగ్స్​ విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు నగరంలో ఎక్కడా అమలు కావడం లేదని, అసలు షెల్టర్ హోమ్స్ లేవని, ఉన్నవి ఏబీసీ(ఆనిమల్స్​ బర్త్​ కంట్రోల్) సెంటర్లు మాత్రమేనని ఆసరా ఎన్జీవో ఫౌండేషన్ ప్రతినిధులు ఆరోపించారు. వాటిలో వందల సంఖ్యలో కుక్కలను కుక్కి నరకం చూపిస్తున్నారని శ్రీనివాసమూర్తి, గౌరీ వందన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ వేయగా కుక్కల తరలింపుపై స్టే ఇచ్చిందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. కుక్కలను పట్టుకుని ఏబీసీ సెంటర్లకు తరలించవద్దని, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసి తిరిగి ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలేయాలని కోర్టు ఆదేశించిందన్నారు.

కానీ నగరంలో ఎక్కడా ఈ ఆదేశాలు పాటించడం లేదన్నారు. మున్సిపాలిటీల్లో స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్‌కు నోడల్ అధికారులను నియమించి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పినా అమలు కాలేదన్నారు. దీనిపై డేటా అడిగితే బల్దియా సమాధానం ఇవ్వలేదని, అందుకే హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు.

ఏబీసీ సెంటర్లలో దారుణ పరిస్థితులు..

ఏబీసీ సెంటర్లనే షెల్టర్లుగా చూపుతూ వందల కుక్కలను అక్కడ ఉంచుతున్నారని ఆసరా ఆనిమల్ ఎన్జీవో ఫౌండర్ గౌరీ వందన అన్నారు. చిన్న కేజ్‌లలో నాలుగు నుంచి ఐదు కుక్కలను పెట్టారని, ఆపరేషన్ చేసినవి, చేయనివి కలిపి ఉంచారని ఆరోపించారు. సరైన ఆహారం ఇవ్వడం లేదని, రోజుకు ఒక్కసారే, అది కూడా నాసిరకం భోజనం పెడుతున్నారని అన్నారు. డాక్టర్లు, పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో అనేక కుక్కలు మృతి చెందే స్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

అందుబాటులో లేని వ్యాక్సిన్​..

కుక్కలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెవెన్ ఇన్ వన్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం లేదని ఫౌండేషన్​ ప్రతినిధులు తెలిపారు. ఒక్క కుక్కకు రేబిస్ వస్తే మిగతా అన్నింటికీ, మనుషులకు కూడా ప్రమాదమని హెచ్చరించారు. పరిస్థితి విషమించకముందే కుక్కలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎక్కడ పడితే అక్కడ వదిలేశారు..

తాము ఏబీసీ సెంటర్లను పరిశీలించిన తర్వాత అక్కడున్న కుక్కలను నగరంలో ఎక్కడ పడితే అక్కడ వదిలేశారని తెలిపారు. జన్మించిన ప్రాంతం కాకుండా వేరే చోటుకు తరలిస్తే కుక్కలు హింసాత్మకంగా మారతాయని హెచ్చరించారు.

అన్నింటినీ ఒకేలా చూస్తారా?

జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో నాలుగు లక్షల కుక్కలు ఉండగా, వాటిలో 80 శాతం స్టెరిలైజేషన్ పూర్తయ్యిందని శ్రీనివాసమూర్తి అన్నారు. అగ్రెసివ్ కుక్కలనే ఏబీసీ సెంటర్లకు తీసుకెళ్లాలని, అన్నింటినీ ఒకేలా చూడడం తప్పన్నారు. కుక్కలు లేకపోతే ఎలుకలు పెరిగి, పాములు, వైరస్‌లు పెరుగుతాయని హెచ్చరించారు. శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీం కోర్టు, ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సమావేశంలో విజయాదేవి, జంతు ప్రేమికులు శశికళ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.