జూబ్లీహిల్స్ లో ఫేక్ ఓట్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత వేసిన పిటిషన్లపై విచారణ ముగించింది హైకోర్టు. ఈ పిటిషన్లపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్ ను రివిజన్ చేసే పనిలో ఎన్నికల సంఘం ఉంది కాబట్టి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.
జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందని గురువారం (అక్టోబర్ 16) బీఆర్ఎస్ పార్టీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో 19 వందలకు పైగా బోగస్ ఓట్లున్నాయని.. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లున్నాయని బీఆర్ఎస్ తరఫున లాయర్ వాదించారు.
అయితే పిటిషనర్లు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ అని.. అక్టోబర్ 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారని ఈసీ న్యాయవాది అవినాశ్ కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు తెలిపారు.
ఈసీ తరఫు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న సీజే ధర్మాసనం.. పిటిషనర్ విజ్ఞప్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ఈసీ న్యాయవాది వాదనలను రికార్డు చేసింది. ఈ పిటిషన్ లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
