కూరగాయలు మస్త్​ పిరమైనయ్.. కిలో 60పైనే

కూరగాయలు మస్త్​ పిరమైనయ్.. కిలో 60పైనే
  • కొత్తిమీర.. మెంతి కిలో 200 దాకా
  • వరుస వర్షాలతో దెబ్బతిన్న పంటలు
  • తండ్లాడుతున్న సామాన్యులు

కరీంనగర్/హైదరాబాద్,  వెలుగు:  ఈసారి వానలు బాగా పడ్డాయి. నార్మల్​గా అయితే  కూరగాయలు ఎక్కువ పండి, రేట్లు తక్కువుండాలి. కానీ కొద్దిరోజులుగా కూరగాయలు మస్తు పిరమైనయ్​. 500 నోటు విడిపిస్తే పట్టుమని ఐదారు కిలోలు కూడా వస్తలేవు. ఏది కొనాలన్నా కిలో 60కి తక్కువ లేదు. ఆకు కూరలైతే మరీ ఘోరం.  పాలకూర, తోటకూర కిలో 100 దాటుతుండగా, కొత్తిమీర, మెంతి కిలోకు 200 దాకా పలుకుతోంది. మారుమూల ఆదిలాబాద్​జిల్లా నుంచి హైదరాబాద్​దాక ఇదే పరిస్థితి.  దీంతో సామాన్యులు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. కిలో కొనేకాడ పావు కిలో, అద్దకిలోతో సర్దుకుంటున్నారు.  ఇటీవల కురిసిన చెడగొట్టు వానలతో  కూరగాయల తోటలు దెబ్బతిని, ఈ పరిస్థితి వచ్చిందని రైతులు, వ్యాపారులు అంటున్నారు.
పది రోజుల్లో ఎంత తేడా.. 
దసరాకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కూరగాయల రేట్లు అన్నిచోట్లా దాదాపు డబుల్​ అయ్యాయి. మొన్నటి వరకు 10 నుంచి 20  రూపాయలకు కిలో ఉన్న టమాట ధర ప్రస్తుతం 60కి చేరింది. పచ్చిమిర్చి కూడా కిలో 50 దాటింది. వంకాయ, దొండకాయ, చిక్కుడు, బీర, అలసంద, బెండ 70కి పైగా పలుకుతున్నాయి. కొన్నిచోట్ల చిక్కుడు రూ.100 దాకా చెబుతున్నారు. బిన్సీస్​ కూడా వందకు తక్కువ లేదు. సాంబార్‍లో ఎక్కువగా వినియోగించే సొరకాయ మొన్నటిదాకా రూ.20 ఉండేది. ఇప్పుడది రూ.40కి తక్కువ రావట్లేదు. వీటితోపాటు ఆకు కూరలు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర వంటి ఆకుకూరలు రూ.40 పెడితే తప్ప నాలుగు కట్టలు రావట్లేదు.  ప్రతి కూర, పచ్చడిలో వినియోగించే కొత్తిమీర, పుదీనా, మెంతి ధరలు మండుతున్నాయి. కొత్తిమీర కిలో 250 వరకు, పుదీనా, మెంతి 200 వరకు కిలో చొప్పున అమ్ముతున్నారు.
చెడగొట్టు వానల వల్లే.. 
పండుగల సీజన్‍లో వెజిటెబుల్స్ రేట్లు కొంత పెరగడం సహజమే. కానీ ఈసారి దాదాపు రెట్టింపయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కోటి 30 లక్షల ఎకరాల దాక సాగు యోగ్యమైన భూములు ఉండగా, మన రైతులు కేవలం 4 నుంచి 5 లక్షల ఎకరాలకు మించి కూరగాయలు సాగు చేయట్లేదు. ఈసారి వానకాలం సీజన్​లో వరుస తుఫానులు, భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగల టైంలో కురిసిన చెడగొట్టు వానలు నిండా ముంచాయి.  ఉదాహరణకు కరీంనగర్‍ జిల్లా కేంద్రానికి చుట్టు పక్కల కూరగాయలు ఎక్కువగా పండించే గ్రామాల్లో మానకొండూర్, తిమ్మాపూర్‍, రామడుగు ముఖ్యమైనవి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ఊళ్లలో తోటలన్నీ దెబ్బతిని దిగుబడులు పడిపోయాయి. చేన్లలోనే టమాలు కుళ్లిపోతుండగా, చిక్కుడు, వంకాయ, కాకర, బీర తదితర పంటలకు పురుగుపట్టి గిడసబారిపోతున్నాయి. ఆకుకూరలకు చీడపట్టి పనికిరాకుండా తయారవుతున్నాయి. వీటిని మార్కెట్​కు తెస్తే రేటు రాదని భావిస్తున్న రైతులు తోటల్లోనే వదిలేస్తున్నారు. తెచ్చిన సరుకులోనూ 25 కిలోల ట్రేలో సుమారు ఐదు కిలోలు వేస్టేజ్‍ కింద పోతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మన రాష్ట్రానికి మహారాష్ట్రలోని ధనోరా నుంచి టమాటా ఎక్కువగా వస్తుంటుంది. క్యాప్సికం, బీట్‍రూట్‍ లాంటి కూరగాయలు కూడా మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతున్నాయి. కానీ అక్కడ కూడా భారీ వర్షాలతో తోటలు దెబ్బతినడం వల్ల కూరగాయలకు కొరత ఏర్పడి, రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. 
హైదరాబాద్​ సిటీలోనూ ఇదే సీన్​ 
ఇక హైదరాబాద్​లోని మెహిదీపట్నం, కూకట్‌‌‌‌పల్లి, ఎర్రగడ్డ, ఎల్లమ్మబండ, అల్వాల్‌‌‌‌, ఆర్‌‌‌‌కే పురం, కొత్తపేట, ఫలక్‌‌‌‌నుమా, మేడిపల్లి, వనస్థలిపురం, మీర్‌‌‌‌పేట ప్రాంతాల్లోని రైతుబజార్లకు రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌, చేవెళ్ల, వికారాబాద్‌‌‌‌, శంకర్‌‌‌‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌ తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. ఆయా చోట్ల డైలీ 600 నుంచి 800 టన్నుల కూరగాయలు విక్రయాలు జరుగుతాయి. కానీ ప్రస్తుతం కేవలం 500 టన్నుల వెజిటేబుల్స్ మాత్రమే వస్తున్నాయి. 
ఆకుకూరలు అయితే డిమాండ్​లో 50 శాతం కూడా రావట్లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో తోటలు దెబ్బతినడం, డీజిల్​రేట్ల వల్ల ఆటో చార్జీలు పెరగడం తో చాలా మంది రైతులు తక్కువ దిగుబడులను హైదరాబాద్​తెచ్చేందుకు ఇష్టపడక లోకల్​గానే అమ్ముకుంటున్నారు. దీంతో సిటీలో కూరగాయలకు కొరత ఏర్పడి, రేట్లు అమాంతం పెరిగాయి. 
రేట్లు పెరిగి కొనుడు తగ్గిచ్చిన్రు
వారం నుంచి కూరగాయల రేట్లు ఎక్కువ అయినయ్. ధరలను చూసి ఎవరూ ఎక్కువ కొంటలేరు. కిలో తీసుకునే దగ్గర పావుకిలో, అద్దకిలో కొంటున్నరు.  కూరగాయలు ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండవాయే. లాభం లేకున్నా ఎంతోకొంత చూసుకొని కూరగాయల్ని అమ్ముతున్నం.-సుమిత్రరాణి, కూరగాయల వ్యాపారి, కరీంనగర్
కొనలేకపోతున్నం 
వరుసగా పండగలు వచ్చినయ్. అప్పటి నుంచే కూరగాయల రేట్లు బాగా పెరిగినయ్. ఏం కొనాలన్న ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తంది. 500 తీసుకుపోతే సంచి కూడా నిండుత లేదు. కిలో కొనాల్సిన చోట అద్ద కిలో కొంటున్నం. ఒక్కోనాడు.. కోడి గుడ్లు, పప్పులతో గడుపుతున్నం. -స్వప్న, గృహిణి, కరీంనగర్