హుజూర్ నగర్ లోని జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ లోని జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • ఇప్పటివరకు 205 ప్రముఖ కంపెనీలు,  9,500 నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ 

హుజూర్‌నగర్‌, వెలుగు : ఈ నెల 25న హుజూర్ నగర్ లోని పెరల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్ నగర్‌‌లో జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలించారు. జాబ్ మేళాలో పాల్గొనేందుకు దేశంలోనే 205 ప్రముఖ కంపెనీలు,  9,500 మంది నిరుద్యోగులు ఇప్పటికే జాబ్ మేళాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు. 

నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకొని  వ్యక్తిగతంగా యువతకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ డీట్, సింగరేణి లాంటి పెద్ద సంస్థల సహాయంతో ప్రభుత్వం ఈ మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు కంపెనీలను తాను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఇంజినీరింగ్, సర్వీస్ రంగాలకు చెందిన కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని ఎంపికలు చేసుకుంటాయన్నారు. అధికారులు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాబ్ మేళాను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలు నాయక్,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,జిల్లా ఎస్పీ నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చందర్రావు వివిధ కంపెనీల ప్రతినిధులు,అధికారులు, నాయకులు పాల్గొన్నారు.