సుప్రీం కోర్టు కొలీజియం ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది.. ఓ న్యాయమూర్తి బదిలీ కథ !

సుప్రీం కోర్టు కొలీజియం ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది.. ఓ న్యాయమూర్తి బదిలీ కథ !

‘న్యాయం చెయొచ్చన్న..భ్రమలు తొలిగిపోయి..అనునిత్య అస్థిరతలో నలిగిపోతున్న.. స్వతంత్రలో ఎంతో అస్వతంత్రత..ఉందని తెలిసిపోయిందని’..హాజర్​ హై’ అన్న నా కవితా సంపుటిలో ‘నేను, నా నల్లకోటు’లో అంటాను. న్యాయవాదికే కాదు. న్యాయమూర్తికి అందులోనూ రాజ్యాంగపరంగా నియమితులైన న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరిస్తలేరని తరచూ అనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణ మధ్యప్రదేశ్​  హైకోర్టు న్యాయమూర్తి అతుల్​శ్రీధరన్​ బదిలీ ఉదంతం. కేంద్ర ప్రభుత్వం కోరినందున జస్టిస్​ అతుల్​ శ్రీధరన్​ను మొదట ప్రతిపాదించినట్టుగా మధ్యప్రదేశ్​ హైకోర్టు నుంచి చత్తీస్​గఢ్​కు బదులుగా అలహాబాద్​ హైకోర్టుకు బదిలీ చేయమని సుప్రీంకోర్టు కొలీజియం అక్టోబర్​14న సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం అతని బదిలీని అక్టోబర్​ 18న చేసింది. చాలా వేగంగా అతని బదిలీని ప్రభుత్వం ఆమోదించింది.

ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వం అభ్యర్థనని సుప్రీంకోర్టు అందరికీ తెలిసే విధంగా ప్రచురించింది. సెకండ్​జస్టిస్​ కేసు (1993), మూడో జడ్జెస్​ కేసు (1998) ప్రకారం వృద్ధి చెందిన రీతిలో ప్రభుత్వం సుప్రీంకోర్టు కొలీజియం తన సిఫారసుని తిరిగి చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ పున:పరిశీలనని ఎందుకు కోరినారనే విషయం మీద సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మౌనంగా ఉంది. జస్టిస్​శ్రీధరన్​బదిలీల క్రమంలో ఆసక్తికరంగా ఉంది. తన కుమార్తె ఇండోర్​లో న్యాయవాదిగా ప్రాక్టీస్​ చేయడానికి వీలుగా ఆయన తన బదిలీని జమ్మూ కాశ్మీర్,  లడక్​  హైకోర్టుకి వెళ్లాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఆయన బదిలీ జరిగింది. 

స్వేచ్ఛ అనుకూలమైన న్యాయమూర్తి
జస్టిస్​ శ్రీధరన్​న్యాయబద్ధంగా పనిచేస్తారని పేరు సంపాదించారు. ప్రజల హక్కుల ఉల్లంఘనలు జరిగినప్పుడు ఆయన తన ఉత్తర్వులు ద్వారా అవసరమైన రిలీఫ్​లని ఇచ్చేవాడు. జులై 2024లో ప్రివెంటివ్​ డిటెన్షన్​ ఉత్తర్వులని రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అంతేకాదు. సమర్థించలేని నిర్బంధ ఉత్తర్వులను జారీ చేసిన జమ్మూ జిల్లా మేజిస్ర్టేట్​ పై రూ.10వేల వ్యక్తిగత జరిమానాను విధించారు.  అంతకుముందు నవంబర్​ 2023లో కాశ్మీర్​ వాలా ఎడిటర్​కి  బెయిలును  మంజూరు చేసిన బెంచికి ఆయన నాయకత్వం వహించారు. అతనిపై మోపిన టెర్రర్​ కుట్రకేసుని కొట్టివేశారు.

న్యాయపరంగా అతను దృఢంగా ఉంటారని పేరుగాంచారు. ప్రజాభద్రతా చట్టం కింద అనేక నివారణ నిర్బంధ ఉత్తర్వులను ఆయన బెంచ్​ కొట్టివేసింది. మార్చి 2025లో ఆయనను మధ్యప్రదేశ్​ హైకోర్టుకు తిరిగి బదిలీ చేశారు. అతను జమ్మూ కాశ్మీర్​కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించే సమయంలో ఆయన్ని మధ్యప్రదేశ్​  హైకోర్టుకు బదిలీ చేశారు. మధ్యప్రదేశ్​ హైకోర్టుకు వచ్చిన తరువాత పౌరహక్కుల ఉల్లంఘన కేసుల్లో అనుకూల దృక్పథంగా వ్యవహరించారు. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో తమకు తాముగా  కేసులను స్వీకరించి  తన ఆదేశాలు జారీచేసి మంచి న్యాయమూర్తిగా పేరుగాంచారు. 

జిల్లా న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల మధ్య సంబంధాలు
జిల్లా న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తుల మధ్య సంబంధాలు భూస్వామ్య వ్యవస్థలోని ప్రభువులకు, బానిసలకు మధ్యగా ఉంటున్నాయని ఓ బెంచ్​లో ఆయన జులై 2025లో అభివర్ణించారు.  భయం, అణచివేత న్యాయవ్యవస్థలో  లోతుగా వ్యాపించి బెయిలు ఇవ్వడానికి జంకుతున్నారని, తప్పుడు శిక్షలు వేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగస్టు 2025లో ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత ఆర్మీ ప్రతినిధి కల్నల్​ సోఫియా ఖురేషిపై  బీజేపీకి  చెందిన  మంత్రి విజయ్​షా చేసిన మతపరమైన వ్యాఖ్యలపై కేసును తమకి తాముగా స్వీకరించి ఎఫ్ఐఆర్​ నమోదు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ మంత్రి క్షమాపణ చెప్పడంతో వదిలిపెట్టింది.  వెనుకబడిన తరగతికి చెందిన ఓ యువకుడు కుల ఉల్లంఘనకి పాల్పడినాడన్న కారణంగా అతనికి ఓ శిక్ష విధించారు.

అతను ఆలయంలోపల బ్రాహ్మణుడికి కాళ్లు కడిగి ఆ నీటిని తాగమని బలవంతం చేశారు. ఆ వీడియో యూట్యూబ్​లో  ప్రసారం అయ్యింది. దీన్ని కూడా జస్టిస్​  శ్రీధరన్​ తనకుతానుగా  స్వీకరించారు. ఇలాంటి చర్యలు కులహింసకి దారి తీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్​ హైకోర్టులో ఆయన కొలీజియంలో స్థానం లభించింది. చత్తీస్​గఢ్కు బదిలీ అయితే అక్కడ కూడా ఆయన కొలీజియంలో భాగమయ్యేవారు. ఆయితే, రెండు నెలల్లోనే సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వం కోరిన మేరకు అతన్ని ఉత్తరప్రదేశ్​కు బదిలీ చేయమని  సిఫారసు  చేసింది. ఈ  సిఫారసుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి బదిలీ చేసింది. ఉత్తరప్రదేశ్​లో ఆయన ఏడవ స్థానంలో ఉంటారు. మే 2028లో ఆయన పదవీ విరమణ చేసేవరకు ఆయన కొలీజియంలో తన పాత్రని నిర్వహించే అవకాశం లేదు.

పూర్వ జస్టిస్ అన్నట్లు.. భయాలు..ఆశలు.. ఇంతేనేమో!
కోర్టును బలోపేతం చేయడానికి కొలీజియం వ్యవస్థ ఏర్పడింది. సంవత్సరాలు గడిచే కొద్దీ బదిలీలు ‘జాతీయ సమైక్యత, ప్రజా ప్రయోజనం, మెరుగైన పరిపాలన పేరుతో సమర్థనని పొందాయి. ఇప్పడు ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ఈ బదిలీలు కార్యనిర్వాహక వ్యవస్థ ఆధిపత్యం చూపించడానికి ఉపయోగపడుతున్నట్టుగా అనిపిస్తుంది. స్వతంత్రంగా ఉండే న్యాయమూర్తులు ఎందుకు ఇంత  అస్వతంత్రంగా ఉంటున్నారో తెలియదు. అది వాళ్లకే తెలియాలి. వాళ్ల అంతరాత్మకే తెలియాలి. నా ‘నేను..నా నల్లకోటు’ పుస్తకంలోని ముందుమాటలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్​ చలమేశ్వర్ అన్నట్టు భయాలు...ఆశలు.. ఇంతేనా...? ఏమో!

అంతర్గత విషయాలు బహిర్గతం 
జస్టిస్​ శ్రీధరన్​ బదిలీలు చాలామందిని కలవరపెడుతున్నాయి.  న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి చాలామంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 2020లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఢిల్లీ అల్లర్ల సమయంలో సాహసమైన  నిర్ణయాలు తీసుకున్న జస్టిస్​ మురళీధర్​ని  ఢిల్లీ  హైకోర్టు నుంచి మరో  హైకోర్టుకు రాత్రికి రాత్రి బదిలీ చేశారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్​  అభయ్​ ఎస్​ ఓకా ఇటీవల ప్రస్తావించారు. జస్టిస్​ అతుల్​ శ్రీధరన్​  బదిలీని కూడా అదే కోణంలో చూస్తున్నాను అని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ మాజీ  డైరెక్టర్ మోహన్ గోపాల్ అన్నారు.

అధికారంలో ఉన్నవారికి మరింత సౌకర్యంగా ఉండే న్యాయమూర్తులతో హైకోర్టులను నింపే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుందని ఒకసారి మాట్లాడుతూ ఆయన అన్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన న్యాయమూర్తులు రాజకీయ నాయకుల మైదానంలో ఫుట్​బాల్​ల  మాదిరిగా మారిపోతున్నారు.  అంతర్గతంగా జరిగే విషయాలను కొలీజియం బహిర్గతం చేస్తోందని సీనియర్​ న్యాయవాది సంజయ్​ హెగ్డే అన్నారు.

డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)