
కోస్గి, వెలుగు: హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 24న కోస్గి హాస్పిటల్లో నిర్వహించే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మంగళవారం హాస్పిటల్‌ను తనిఖీ చేసి క్యాంప్ నిర్వహణపై కాడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే శిబిరానికి నిపుణులైన డాక్టర్లు వస్తారని, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తిస్తే నయం చేయవచ్చని, క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఆరోగ్యాన్ని కాపాడుకునే ముందస్తు జాగ్రత్తగా పేర్కొన్నారు.
అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మోడల్ క్రష్ రూమ్‌ను కలెక్టర్ పరిశీలించారు. వర్కింగ్ ఉమెన్స్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన మోడల్ క్రష్ గదిని అందంగా తీర్చిదిద్దారని అభినందించారు. పట్టణంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. డీసీహెచ్ మల్లికార్జున్, తహసీల్దార్ బి.శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.