రూ.20 లక్షలు ఖర్చు: కరోనాతో భార్యాభర్తలు మృతి

రూ.20 లక్షలు ఖర్చు: కరోనాతో భార్యాభర్తలు మృతి

సుల్తానాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. వారం వ్యవధిలో భార్యాభర్తలను బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన అయిల సాంబమూర్తి(48), మహిమలత(46)కు సుస్మిత, హర్షిత ఇద్దరు పిల్లలు. సాంబమూర్తి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​కంపెనీలో జాబ్​చేస్తూ ఫ్యామిలీతో ఉంటున్నాడు. కరోనా సోకడంతో సిటీలోని ప్రైవేట్​ హాస్పిటల్​లో అడ్మిట్​అయ్యాడు. చికిత్స పొందుతూ గత నెల 27వ తేదీన చనిపోయాడు. తర్వాత మహిమలత టెస్టు చేయించుకోగా పాజిటివ్​అని తేలింది. కొద్ది రోజులు హోం ఐసోలేషన్​లో ఉన్న ఆమె.. తర్వాత సీరియస్​అవ్వడంతో ప్రైవేట్​హాస్పిటల్​లో చేరింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పిల్లల పెళ్లిళ్ల కోసం కూడబెట్టుకున్న డబ్బు మొత్తం హాస్పిటల్ ఖర్చులకే అయిపోయిందని బంధువులు తెలిపారు. రూ. 20లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని కన్నీటి పర్యంతమయ్యారు.

 మహబూబాబాద్​లో మరో ఇద్దరు

మహబూబాబాద్ అర్బన్​: ఒక్కరోజు గ్యాప్​లో మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో భార్యాభర్తలు చనిపోయారు. 23వ వార్డు మిలట్రీ కాలనీకి బంగారి దేవేందర్(42), సుమలత(37)కు టింకుప్రియ, సోనిక, సాయిరామ్ ముగ్గురు పిల్లలు. దేవేందర్​భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం భార్యాభర్తలు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో చేరగా చికిత్స పొందుతూ సోమవారం సుమలత మృతి చెందింది. మంగళవారం రాత్రి దేవేందర్​ చనిపోయాడు. 
ఒకేరోజు ఊర్లో 23 మందికి పాజిటివ్​
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుంపెళ్ళగూడెం గ్రామంలో బుధవారం 36 మందికి పరీక్షలు చేయగా 23మందికి పాజిటివ్ గా తేలింది. ఓవైపు లాక్​డౌన్​కొనసాగుతున్నా కేసులు పెరిగిపోవడంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గురువారం కూడా గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగించనున్నట్లు మండల వైద్యాధికారి యాసా హన్మంతరావు చెప్పారు.