ఒకేరోజు నాలుగు మర్డర్లు

ఒకేరోజు నాలుగు మర్డర్లు

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​​లో ఇద్దరు, రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో ఒకరి చొప్పున  హత్యకు గురయ్యారు. బోరబండలోని అల్లాపూర్​కు చెందిన సయ్యద్​ షాహెద్(22) రౌడీషీటర్. అదే ప్రాంతానికి చెందిన సాజిద్, మున్నా, సమీర్​, పవన్​తో కొన్ని దందాలు చేశాడు. షాహెద్​కు ఇతరులతో విభేదాలు తలెత్తడంతో హత్య చేయాలని స్కెచ్​ వేశారు. ఆదివారం పవన్​ బర్త్​డే ఉందని, పార్టీ చేసుకుందామని షాహెద్​ను కూకట్​పల్లికి రప్పించారు. వడ్డేపల్లి ఎన్​క్లేవ్​ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మద్యం తాగిన అనంతరం బీరు బాటిళ్లు పగులగొట్టి షాహెద్​ గొంతులో పొడిచి, తలపై కొట్టి హత్య చేశారు.

కత్తితో దాడి చేసి..

ఎల్బీనగర్: కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్(45) అదే ఏరియాలో జ్యూష్ షాపు నిర్వహిస్తున్నాడు. నాగోల్​ పీఎస్​ పరిధిలోని పసుమాముల శివారులో అతన్ బాయి లేఅవుట్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, ఏసీపీ కృష్ణయ్య, నాగోలు సీఐ సూర్యనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈయన హత్య అనంతరం భార్య ఫోన్​ ఆఫ్​ చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం గమనార్హం. 

ఓల్డ్​ సిటీలో టైలర్​..

ఓల్డ్ సిటీ కాలపత్తర్ లో నివాసం ఉంటున్న షేక్​ ఇస్మాయిల్(33) హుస్సేన్ అలంలో టైలర్ గా పనిచేస్తున్నాడు. ఆదివారం డ్యూటీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సోమవారం తెల్లవారుజామున బహద్దూర్ పుర ప్లైఓవర్ కింద ఆయన మృతదేహం కనిపించింది. ఒంటిపై గాయాలను బట్టి పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. 

బాట కోసం జరిగిన గొడవలో..

కొడంగల్: పొలం బాట కోసం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. కొడంగల్​ సీఐ శ్రీధర్​రెడ్డి తెలిపిన ప్రకారం.. దౌల్తాబాద్​ మండలంలోని బండివాడ తండా, హన్మ్య నాయక్​ తండాల మధ్య కొన్నేళ్లుగా బాట పంచాయితీ ఉంది. ఆదివారం ఇరు తండాల వారు దాడులు చేసుకున్నారు. బండివాడ తండాకు చెందిన చౌహాన్​ వెంకట్​నాయక్(37)పై రాడ్లు, కట్టెలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.