నెరవేరనున్న 50 ఏళ్ల గిరిజనుల కల..భూభారతి కింద సర్వే పట్టాలు సిద్ధం

నెరవేరనున్న  50 ఏళ్ల గిరిజనుల కల..భూభారతి కింద సర్వే పట్టాలు సిద్ధం
  • తిరుమలగిరి సాగర్ మండలంలో తేలిన భూముల పక్కా లెక్క 
  • 4037 ఎక‌‌‌‌రాల‌‌‌‌కు సంబంధించి 4219 మంది రైతులకు పట్టాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయం  
  • త్వరలో సీఎం చేతుల మీదుగా రైతులకు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు 

నల్గొండ/హాలియా, వెలుగు:  50  ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల కల త్వరలోనే  నెరవేరబోతుంది.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి చట్టాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి భూభారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటగా  నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి (సాగర్) మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సమగ్ర స‌‌‌‌ర్వే చేసింది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ధరణిని తీసుకురావడంతో పాత పట్టా పాసుపుస్తకాలు స్థానంలో కొత్త పట్టా పాసు పుస్తకాలు రైతులకు అందజేశారు.   భూమి సాగుపై పేద రైతు ఉండగా రాజకీయ పలుకుబడి ఉన్న కొందరికి పట్టాలు అందాయి.

23 వేల ఎకరాల్లో  సర్వే ...

భూభార‌‌‌‌తి పైల‌‌‌‌ట్ ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా మండల పరిధిలోని14 రెవెన్యూ విలేజీల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి 235 స‌‌‌‌ర్వే నెంబ‌‌‌‌ర్లను ఎంపిక చేశారు.  మొత్తం 23 వేల ఎక‌‌‌‌రాల్లో  స‌‌‌‌ర్వే నిర్వహించ‌‌‌‌గా అందులో 12 వేల ఎక‌‌‌‌రాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారు.  ఇందులో 8 వేల ఎక‌‌‌‌రాలు సాగుకు అనుకూలంగా ఉండగా వాటిలో 4 వేల ఎక‌‌‌‌రాల్లో రైతులు సాగు చేసుకుంటూ పట్టాదారు పాసు పుస్తకాల‌‌‌‌ను కలిగి ఉన్నట్లు గుర్తించారు.  మిగిలిన 4037 ఎక‌‌‌‌రాల‌‌‌‌కు సంబంధించి 4219 మంది గిరిజన రైతులకు కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు.  

మరో 7 ఎకరాల ఫారెస్ట్, డీ ఫారెస్ట్ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. స‌‌‌‌ర్వేలో భాగంగా 2,936 ఎక‌‌‌‌రాల‌‌‌‌కు సంబంధించి 3,069 మంది వ‌‌‌‌ద్ద బోగ‌‌‌‌స్ పాసు పుస్తకాలు ఉన్నట్లు గుర్తించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పాసు పుస్తకాల‌‌‌‌ను ర‌‌‌‌ద్దు చేశారు. పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రైతు భీమా, భరోసా, ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా రద్దు చేశారు.

ఆరు నెలల పాటు కొనసాగిన భూములు గుర్తింపు సర్వే

 భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన తిరుమల (సాగర్) మండలంలో రెవెన్యూ అధికారులు ఆరు నెలల పాటు తీవ్రంగా శ్రమించి సర్వేను పూర్తి చేయగలిగారు.  మొత్తం సర్వేలో ఏడుగురు తహసీల్దార్లు 20 మంది సర్వేయర్లు 120 మంది స్టాఫ్  కలిసి14 రెవెన్యూ విలేజీలో సర్వేను సమగ్రంగా నిర్వహించారు.  ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ టీం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సాగుచేస్తున్న అధీనంలో ఉన్న భూములను, గెట్లను, సరిహద్దులను గుర్తించారు. 

ఆ తర్వాత ప్రతి రైతు సాగులో ఉన్న భూమికి హద్దురాళ్లను పాతారు. బోగస్ పట్టాలను రద్దు చేసి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో రిమూవ్ చేశారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా  తిరుమలగిరి మండలంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన గిరిజన రైతులకు  పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర  సీఎం  రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చేపట్టేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను రెవెన్యూ అధికారులు ఇప్పటికే  పూర్తి చేశారు. 

 రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు సిద్ధం

 పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన తిరుమలగిరి సాగర్ మండలంలోని 14 రెవెన్యూ విలేజ్ లో సుమారు 4037 ఎకరాలకు సంబంధించి 4219 మంది రైతులకు పట్టాలు ఇచ్చేందుకు పాస్ పుస్తకాలను సిద్ధం చేసాం ఇప్పటికే రైతులకు సంబంధించిన పహాని, వన్ బి  వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  నమోదు చేశాం.  ప్రభుత్వ భూములతో పాటు ఫారెస్ట్ డిఫారెస్టు భూములకు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రభుత్వానికి నివేదించాం.- తిరుమలగిరి తహసీల్దార్ అనిల్ 

 గిరిజనుల కష్టాలు తొలగించేందుకు కృషి

 నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 50  ఏళ్లుగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలు తీరనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన గిరిజన రైతులకు పట్టాలు అందిస్తాం. -  నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి