- కాళేశ్వరంపై తాను మాట్లాడినట్లు తప్పుడు వార్తలు రాశారు
- ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే గుంటూరు వెళ్తున్న
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : ‘నేను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని కొందరు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు, అలాంటి పుకార్లను ఎవరూ నమ్మొద్దు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం (సెప్టెంబర్ 18) గుంటూరు వెళ్తూ.. నల్గొండ జిల్లా చిట్యాలలోని ఓ హోటల్‌లో కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని చానల్స్‌లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని, కాళేశ్వరంపై తాను అనని మాటలను అన్నట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై మొట్టమొదట అసెంబ్లీలో ప్రస్తావించిందే తానని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీ అన్నా, సోనియాగాంధీ అన్నా, రాహుల్‌గాంధీ అన్నా ఎంతో అభిమానం ఉందని, తమ కుటుంబానిది కాంగ్రెస్ పార్టీ నేపధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడానని చెప్పారు. ‘ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను కొందరు అనుకూలంగా మార్చుకున్నారన్న అనుమానాలు ఉన్నాయి, భూ నిర్వాసితుల విషయంలో కూడా తగిన పరిహారం ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుంది’ అని తన అభిప్రాయం చెప్పానన్నారు.
ఈ రోజు కూడా తాను గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుంటే మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు వెళ్తున్నానని పుకార్లు సృష్టిస్తున్నారని, తాను, మరికొందరు లీడర్లు కలిసి గుంటూరులో కార్యక్రమానికి హాజరైన అనంతరం విజయవాడ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్ గురించి మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తానని.. అప్పటివరకు ఎలాంటి దుష్ర్పచారాలు నమ్మొద్దని సూచించారు.
