
- వాట్సాప్ గ్రూపులో సైబర్ గ్యాంగ్ మోసం
హైదరాబాద్, వెలుగు: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే, ఎక్కువ లాభాలు వస్తాయని ఆశచూపి హైదరాబాద్ కు ఓ వ్యాపారి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 3.24 కోట్లు కొట్టేశారు. నకిలీ స్టాక్ బ్రోకింగ్ యాప్‌లలో ఐపీఓల పేరిట పెట్టుబడులు పెట్టించి దోచుకున్నారు. హైదరాబాద్ లోని గాంధీనగర్ కు చెందిన వ్యాపారి శీతల్ గన్వాల్ వాట్సాప్ కు మే 28న బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో లింక్ వచ్చింది. ఆ లింక్‌ను అతను ఓపెన్ చేసి ఆ గ్రూప్‌లో చేరాడు.
అదే గ్రూప్‌లో ప్రిషా సింగ్ (అడ్మిన్), పురవ్ ఝవేర్ (అసిస్టెంట్) నిర్వాహకులుగా ఉన్నారు. గ్రూప్‌లో మార్కెట్ ట్రెండ్స్, బ్లాక్ ట్రేడ్‌లు, ఐపీఓల గురించి రోజువారీ సమాచారం ఇస్తామని వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసేవారు. ఈ ఏడాది జూన్, జులైలో లిస్ట్ కాబోతున్న కంపెనీల బ్లాక్ ట్రేడింగ్, ఐపీఓల కోసం దరఖాస్తు చేయాలని గన్వాల్ కు సూచించారు. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల ద్వారా ఐపీఓల కేటాయింపును సులభం చేస్తామని, దీంతో మంచి లాభాలు వస్తాయని నమ్మించారు.
దీంతో శీతల్ మే 30న మొదటి లావాదేవీ చేశాడు. జులై 9 వరకు ‘బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ లిమిటెడ్’ ఖాతాలకు పలు దఫాలుగా మొత్తం రూ.3.24 కోట్లు బదిలీ చేశాడు. మీకు లాభాలు వచ్చాయని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో తన బ్యాంకు ఖాతాలకు లాభాలను మళ్లించేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ సొమ్ము అతని బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో మోసపోయినట్టు గుర్తించి అధికారులకు బాధితుడు ఈ నెల 11న ఫిర్యాదు చేశాడు.