అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియం : రేవంత్‌‌‌‌

అత్యుత్తమ క్రీడా వేదికగా గచ్చిబౌలి స్టేడియం : రేవంత్‌‌‌‌
  • అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు.. హెలిప్యాడ్ నిర్మాణం: రేవంత్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరాన్ని దేశ క్రీడారంగంలోనే ఒక రోల్ మోడల్‌‌‌‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగా గచ్చిబౌలి స్టేడియంను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా వేదికగా మారుస్తామని చెప్పారు. ఆదివారం బంజారాహిల్స్‌‌‌‌లోని లీలా హోటల్‌‌‌‌లో  ‘తెలంగాణ స్పోర్ట్స్ హబ్’ బోర్డు సమావేశం నిర్వహించారు. బోర్డు సభ్యులు కొణిదెల ఉపాసన, కావ్య మారన్, సంజీవ్ గోయెంకా, సీ శశిధర్, ప్రభుత్వ ఉన్నతాధికారి జయేశ్‌‌‌‌ రంజన్, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ..  జూన్ 2న గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఈలోగా పక్కా యాక్షన్ ప్లాన్‌‌‌‌తో రావాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ హబ్ కోసం ఇప్పటికే ఆర్కిటెక్చర్‌‌‌‌ను నియమించామని, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేని విధంగా దీనికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

క్రీడాకారులకు ఓకేచోట అన్ని వసతులు..

అత్యాధునిక సాంకేతికతను జోడించి, క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులను ఒకే చోట కల్పించడం ద్వారా గచ్చిబౌలిని అంతర్జాతీయ స్పోర్ట్స్​ ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్‌‌‌‌గా మార్చాలని బోర్డు సభ్యులకు సీఎం రేవంత్‌‌‌‌ సూచించారు. ఆ మేరకు  స్టేడియం అభివృద్ధిపైన బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతోపాటు ప్రత్యేకంగా హెలీప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు.

విమానాశ్రయం నుంచి వచ్చే క్రీడాకారులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా హెలికాప్టర్ ద్వారా స్టేడియానికి చేరుకునేలా రవాణా వ్యవస్థను అనుసంధానించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ స్పోర్ట్స్ హబ్‌‌‌‌కు నిధుల కొరత రాకుండా ఉండేలా పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో క్రీడా సంస్కృతిని పునరుద్ధరించి, దీర్ఘకాలికంగా క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.