విదేశీయులకూ టిమ్స్ వైద్యం.. ఒక్కో ఆస్పత్రిలో స్పెషల్ గా 50 బెడ్లు

విదేశీయులకూ టిమ్స్ వైద్యం.. ఒక్కో ఆస్పత్రిలో స్పెషల్ గా 50 బెడ్లు
  • ఒక్కో ఆస్పత్రిలో విదేశీయులకు స్పెషల్ గా 50 బెడ్లు కేటాయింపు
  • విదేశీ సర్కార్లతో మన ప్రభుత్వం నేరుగా ఎంఓయూలు
  • ప్రైవేటుకు దీటుగా ఆంబియన్స్.. తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఇప్పటికే గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్‌ గా ప్రసిద్ధి చెందింది. ఈ గుర్తింపును మరింత పెంచుతూ.. విదేశీ పేషంట్లను ప్రభుత్వ హాస్పిటల్స్ వైపు ఆకర్షించేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్ చేస్తున్నది. కొత్తగా నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్ తో పాటు అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక ఇంటర్నేషనల్ పేషెంట్ వింగ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానాలకే పరిమితమైన విదేశీ వైద్య సేవలు ఇకపై సర్కారు పరిధిలోకి కూడా రానున్నాయి. మరోవైపు.. జూన్ 2 న సనత్ నగర్ టిమ్స్ తో పాటు, అల్వాల్ టిమ్స్ ను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

విదేశీ ప్రభుత్వాలతో జీ టు జీ ఒప్పందాలు..

విదేశీ రోగులను నేరుగా రప్పించేందుకు ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ (జీ టు జీ) ఒప్పందాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి ఎక్కువగా పేషంట్లు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌ కు వస్తుంటారు. ఆయా దేశాల ప్రభుత్వాలతో నేరుగా ఎంఓయూలు చేసుకోవడం ద్వారా విదేశీ పేషంట్లకు టిమ్స్ హాస్పిటల్స్ లోనే వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. మెడికల్ టూరిజాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ హాస్పిటల్స్ లో ఒక్కో చోట స్పెషల్ గా 50 బెడ్లను విదేశీయుల కోసమే కేటాయించనున్నారు.

తక్కువ ఖర్చుతోనే ట్రీట్మెంట్

ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే రోగులు ఎక్కువగా సిటీలోని కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. అయితే, అక్కడ చికిత్స ఖర్చు చాలా భారంగా ఉంటున్నది. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలకు మించిన వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించాలనేది సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, గుండె ఆపరేషన్లు, క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు కూడా టిమ్స్‌ లో అంతర్జాతీయ స్థాయి చికిత్స అందించనున్నారు.