
- మండుతున్న ఎండలతో వెస్ట్ సిటీలో పెరిగిన బుకింగ్!
- ఈ నెల14 నాటికి 86,520 ట్యాంకర్ల బుకింగ్
- గత ఏడాదితో పోలిస్తే 36 శాతం అధికం
- ఇంకుడు గుంతలు తప్పనిసరి చేస్తూ మళ్లీ నోటీసులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్లో ఎండాకాలం తర్వాత వాటర్‌ట్యాంకర్లకు డిమాండ్ తగ్గినా.. వర్షాలు లేకపోవడంతో ఈ నెల మళ్లీ బుకింగ్స్పెరిగాయి. ముఖ్యంగా వెస్ట్‌సిటీలో సమస్య తీవ్రంగా ఉంది. వర్షాకాలం మొదలైనా గత నెల నుంచి గ్రేటర్‌పరిధిలో వర్షాలు సరిగ్గా కురవకపోగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ సిటీలో భూగర్భజలాల సమస్య ఉండగా, ఈ ఎండలతో నీటికి డిమాండ్విపరీతంగా పెరిగింది. బోర్లు ఎండిపోవడంతో చాలా మంది వాటర్‌బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు.
42 వేల ఇండ్ల నుంచే ఎక్కువ శాతం..
బోర్డు పరిధిలో దాదాపు 14 లక్షల కనెక్షన్లుండగా, ఇందులో వెస్ట్సిటీలోని 42 వేల ఇండ్ల నుంచి ఎక్కువగా ట్యాంకర్లు బుక్అవుతున్నాయి. ఇందులో 500 మంది అయితే, ఎండాకాలంలోని 75 రోజుల్లో 31 వేల ట్యాంకర్లు బుక్ చేసుకున్నారు. ఈ 42 వేల మందే 90 శాతం ట్యాంకర్లను అంటే 2.84 లక్షల ట్యాంకర్లను బుక్ చేసుకున్నారని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ సిటీలోని మాదాపూర్, హైటెక్‌సిటీ, నార్సింగి, కోకాపేట, మణికొండ, కొండాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్ వంటి ప్రాంతాల నుంచే ఎక్కువగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటున్నారు.
ఏఏ ప్రాంతాల్లో ఎలా ఉందంటే..
గత ఏడాది జులై రెండో వారానికే ఎస్ఆర్నగర్ డివిజన్ పరిధిలో 9,058 ట్యాంకర్లు బుక్కాగా, ఈసారి 13,660, మణికొండ డివిజన్‌పరిధిలో గతంలో 6,897 బుక్కాగా, ఈసారి 9,822, గత సంవత్సరం నిజాంపేట పరిధిలో 5,454 , ఈసారి 7,127 ట్యాంకర్లు, కుత్బుల్లాపూర్ పరిధిలో అప్పుడు 2,464 , ఈసారి 3,150 బుక్అయ్యాయి. కూకట్పల్లి డివిజన్ పరిధిలో గత సంవత్సరం 8,764 ట్యాంకర్లు బుకింగ్ జరిగితే ఈసారి 10,782 బుక్ అయ్యాయి. 2024లో దుర్గం చెరువు పరిధిలో 14,589 ట్యాంకర్ల బుక్ కాగా, ఈసారి 17,872, హఫీజ్‌పేట పరిధిలో గతంలో 3,880, ఈసారి 4,265 ట్యాంకర్లు బుక్అయ్యాయి. వీరికి బోర్డు పరిధిలోని 1,135 ట్యాంకర్ల ద్వారా రెండు షిఫ్టుల్లో నీటి సరఫరా చేస్తున్నారు.
గత జులైతో పోలిస్తే..
గత సంవత్సరం జులై నెలతో పోలిస్తే ఈసారి 36 శాతం డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు. 2024, జులైలో ఒకటో తేదీ నుంచి 14వ తేదీ నాటికి 63,724 ట్యాంకర్లు బుక్కాగా, ఈ ఏడాది జూలై 1 నుంచి14 నాటికి 86,520 ట్యాంకర్లు బుక్అయినట్టు అధికారులు తెలిపారు. ఒక్క మాదాపూర్ ప్రాంతంలోనే గత ఏడాది జులై 14 నాటికి14,589 ట్యాంకర్లు బుక్కాగా, ఈసారి 17,872 ట్యాంకర్లు బుక్అయ్యాయి.
దీంతో వెస్ట్‌సిటీలో నీటి సమస్యను గుర్తించిన వాటర్‌బోర్డు ఈ సంవత్సరం రెయిన్ వాటర్ హార్వెస్ట్ పై సీరియస్ ఎఫెర్ట్పెట్టాలని భావిస్తున్నది. వెస్ట్‌సిటీ నుంచి అత్యధికంగా ట్యాంకర్లు బుక్‌చేసిన 42 వేల మంది ఇండ్లలోనూ, ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు లేవని గుర్తించి, వారందరికీ మరోసారి నోటీసులు పంపాలని నిర్ణయించారు.