
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్ నగర్, హైటెక్ సిటీ వద్ద నిర్మిస్తున్న నమిత 360 లైఫ్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ఇజ్జత్ నగర్‌లోని సర్వే నంబర్ 12/పీ, 13/పీలో నిర్మాణాలకు అగ్నిమాపక శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఎన్‌ఓసీలను జారీ చేయకుండానే అక్రమంగా నిర్మాణం చేపడుతుంటే జీహెచ్‌ఎంసీ ఏం చేస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోపాలను సరిదిద్దకుండానే గత జూన్ 11న ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి తెలిపారు.
నమితా హోమ్స్ 25 అంతస్తుల్లో 360 లైఫ్ ప్రాజెక్టు పేరుతో చేపట్టిన నిర్మాణాలు చట్టవ్యతిరేకమని పేర్కొంటూ సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన యర్రం విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండానే జీహెచ్‌ఎంసీ కమిషనర్ జూన్ 11న ఉత్తర్వులు ఇచ్చారని, స్టే ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అక్రమాలను గుర్తించి మే నెలలో నిలిపివేసిన జీహెచ్‌ఎంసీ, తర్వాత లోపాలను సరిచేయకుండానే జూన్‌లోనే అనుమతులు ఇచ్చిందన్నారు. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.