వాన మిగిల్చిన కష్టాలు..ఇంకా వరద నీటిలోనే పలు ప్రాంతాలు

వాన మిగిల్చిన కష్టాలు..ఇంకా వరద నీటిలోనే పలు ప్రాంతాలు

హైదరాబాద్ ను ఇంకా వాన కష్టాలు వీడలేదు.  వర్షాలు కాస్త తగ్గినా.. వరద మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సిటీలోని చాలా ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. దీంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో.. మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మూసారాంబాగ్ బ్రిడ్జిని తాకూతు ప్రవహిస్తోంది మూసీ.  దీంతో బ్రిడ్జిపై  నుంచి రాకపోకలను బంద్ చేశారు.

హైదరాబాద్ లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో..ఇంకా వరద నీరు అలానే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు నిలవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు కోసం బయటకు పోయేందుకు అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తుండటంతో..పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 

 కుత్బుల్లాపూర్ గాజులరామారం ఇంకా వరదలోనే ఉంది. దీంతో నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ఐదేండ్ల నుంచి వర్షం కురిసిన ప్రతీసారి ఇదే పరిస్థితి అంటున్నారు వోక్షిత ఎంక్లేవ్ వాసులు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన..పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి..మోటార్ల సాయంతో వర్షం నీటిని తొలగించాలని కోరుతున్నారు.

  మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో కాలనీల్లో నిలిచిన వరద నీటిని తొలగించారు మున్సిపల్ సిబ్బంది. కాలేజీలోకి వరద నీరు రావడంతో మల్లారెడ్డి యూనివర్సిటీకి సోమవారం వరకు సెలవు ప్రకటించారు. వర్షాలు పడితే హాస్టళ్లకు మరింత వరద వచ్చే చాన్స్ ఉండడంతో స్టూడెంట్స్ ను ఇళ్లకు పంపించారు.

Also Read :- పలు జిల్లాల్లో వానలు..నీటమునిగిన వరి, పత్తి పంటలు

 లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ఇంకా వరదలోనే ఉంది. ప్రస్తుతం భారీ అండర్ పాస్ బ్రిడ్జి నాలాను తలపిస్తోంది. దీంతో  రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. వర్షం పడిన ప్రతీసారి రైల్వే ట్రాక్ పై నుంచి వెళ్తున్నామని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. 

ఈసీ, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. రాజేంద్రనగర్ నుండి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పూర్తిగా మూసి వేశారు పోలీసులు. అలాగే నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్లే దారిని బంద్ చేశారు.  వేరే రూట్లలో గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ ని తాకుతూ మూసీ ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు ట్రాఫిక్ పోలీసులు.

 హైదరాబాద్  నానక్ రామ్ గూడ మీనాక్షి టవర్ సర్కిల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రోడ్లపై  వరద నీరు ఉండటంతో..వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే  రూట్ నుంచి గచ్చిబౌలి, కోకాపేట్ కు వెళ్తారు వాహనదారులు. 

మరోవైపు సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున సిటీలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. 45 నిమిషాల వరకు నాన్ స్టాప్ గా వర్షం పడింది. కుండపోత వానతో  రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  రాత్రి  సిటీతో పాటు.. శివారు ప్రాంతాల్లో వర్షం పడింది.  పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, చింతల్, గాజులరామారం, కూకట్ పల్లి, మూసాపేట్, నిజాంపేట్ భారీ వర్షం పడింది. రాజేంద్రనగర్, మణికొండ, పుప్పాలగూడ, మెహిదీపట్నం, లక్డికపూల్, నాంపల్లి, కోఠి, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, హయత్ నగర్ లో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికే రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద చేరింది.