పలు జిల్లాల్లో వానలు..నీటమునిగిన వరి, పత్తి పంటలు

పలు జిల్లాల్లో వానలు..నీటమునిగిన వరి, పత్తి పంటలు

తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిజామాబాద్ లో 3 రోజులుగా ఎడతెరిపిలేకుండా వాన పడుతోంది. బడా బీంగల్ లోని పెద్దచెరువు డేంజర్ లెవల్ లో ప్రవహిస్తోంది. కప్పలవాగు ప్రవాహంతో పొంటపొలాలు నీటమునిగాయి. భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలో పంటలకు తీవ్రనష్టం జరిగింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరదనీరు ముంచెత్తి పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేశాయి. పత్తిపంటలో నీరు నిలిచి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు రైతులు. 

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 696 అడుగులకు చేరింది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల అప్పర్ మానేరు మత్తడి దూకుతోంది. కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, మెదక్ కూడెల్లి వాగుల నుంచి అప్పర్ మానేరుకి వరద నీరు వస్తోంది. దీంతో గంభీరావుపేట్, సిద్దిపేట ల మధ్య,  నర్మాల - దుబ్బాకల మధ్య రాకపోకలకు ఇబ్బంది అవుతోంది.

వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని జంట జలాశయాలు నిండు కుండలుగా మారాయి. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే వారిని అప్రమత్తం చేశారు. 

Also Read :- వాన మిగిల్చిన కష్టాలు..ఇంకా వరద నీటిలోనే పలు ప్రాంతాలు

 భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతాల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. బహదూర్ గూడా గ్రామంలోని పొతిరెడ్డి చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువు నీరు చుట్టు పక్కల ప్రాంతాలను ముంచేసింది. దీంతో పంటపొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.వరద నీరు వెళ్లే కల్వర్టును ఓ వెంచర్ వాళ్లు మూసివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు స్థానికులు. చెరువు నీటిని హిమాయత్ సాగర్ లోకి వెళ్లే విధంగా  ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు పొంగుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి నూర్నంపల్లి వాగు ఉదృతంగా ప్రవహించడంతో ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. రాకపోకలు బంద్ అయ్యాయి. 30ఏళ్లుగా వర్షాలు పడిన ప్రతిసారి వాగు పొంగుతోందని.. ఈ సమస్యను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు.