జూబ్లీహిల్స్ , వెలుగు : ఫిలింనగర్ పీఎస్పరిధిలో ఓ వ్యక్తి నుంచి రూ. 50 వేలు లాక్కున్న ఓ కానిస్టేబుల్, హోంగార్డ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాధితుడు గుంటి సత్యనారాయణ ఈనెల నాలుగో తేదీన తన అవసరాల కోసం స్నేహితుడి వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకుని షేక్ పేటలో ఒంటరిగా వెళ్తున్నాడు. అప్పుడే ఇద్దరు పోలీసు సిబ్బంది అడ్డగించి నగదు ఎక్కడిదని ప్రశ్నిస్తూ, అక్రమ డబ్బుగా కేసు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు.
ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పినా వినకుండా అతడి బ్యాగులో నుంచి రూ.50 వేలు తీసుకున్నారు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫిలింనగర్ పోలీసులు ప్రమేయం ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఎస్. మల్సూర్ (34), హోంగార్డు మోహన్ గౌడ్ (39)ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
