
- రూ.85 లక్షలు విలువ చేసే కొకైన్ స్వాధీనం
- నైజీరియా టు హైదరాబాద్ వయా ముంబై
- ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) పోలీసులు అరెస్ట్ చేశారని సిటీ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.85 లక్షలు విలువ చేసే 286 గ్రాముల కొకైన్, 100 గ్రాముల మెఫాడ్రిన్, ఒక పిస్టల్, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 3 గ్యాంగ్లను పట్టుకున్నట్లు చెప్పారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సీసీఎస్ ఆఫీస్‌లో సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. 9 మందిలో ఆరుగురు కొకైన్, ముగ్గురు మెఫాడ్రిన్ డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకు చిక్కారు. విచారణలో భాగంగా ఇద్దరు నైజీరియన్ డ్రగ్ ట్రాఫికర్ల సమాచారం అందడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసులో రవివర్మ, సచిన్ అనే ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారి నుంచి కీలక సమాచారం సేకరించారు. రవివర్మకు ముంబైకు చెందిన ముఠాతో సంబంధాలున్నాయి. అక్కడ ఉన్న ముజాయిత్ అనే పెడ్లర్.. నైజీరియా నుంచి సముద్ర మార్గం ద్వారా కొకైన్ తెప్పిస్తాడు. అతడు చైతన్య, ఖాన్ అనే సబ్ సప్లైయర్ల ద్వారా హైదరాబాద్‌కు సప్లై చేస్తాడు. ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వినియోగదారుడిని అరెస్ట్ చేయడంతో ఈ ముఠా గుట్టురట్టయింది. నిందితుల నుంచి రూ.69లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ పెడ్లర్‌గా బీటెక్ స్టూడెంట్
రెండో గ్యాంగ్‌లో పవన్ భాటి, హేమ్ సింగ్, జితేందర్ కీలకంగా ఉన్నారు. కాటేదాన్‌కు చెందిన జితేందర్.. రాజస్థాన్ నుంచి సిటీకి వచ్చి మిఠాయి కొట్టు పెట్టుకున్నాడు. నష్టం రావడంతో డ్రగ్స్ వ్యాపారంలో దిగాడు. పవన్ భాటితో కలిసి 2022 నుంచి డ్రగ్స్ అమ్ముతున్నాడు. వీరు రాజస్తాన్‌కు చెందిన సురేందర్, హనుమాన్ నుంచి డ్రగ్స్ కొంటారు. సేఫ్టీ కోసం జితేందర్ రూ.75వేలతో కంట్రీ మేడ్ గన్ కొన్నాడు. కాటేదాన్‌లో ఒక రౌండ్ ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడని సీపీ వివరించారు. ఇక మూడో గ్యాంగ్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడింది. హర్ష అనే బీటెక్ స్టూడెంట్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. గోవాకు చెందిన క్రిస్ అనే పెడ్లర్‌తో పరిచయం ఏర్పడింది. ముందు డ్రగ్స్ వినియోగించేవాడు.
తర్వాత పెడ్లర్‌గా మారాడు. అతని వద్ద నుంచి 10 గ్రాముల కొకైన్, ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇద్దరు నైజీరియన్లు క్లెమెంట్, లాజారూస్ పాత్ర బయటపడింది. వీరిద్దరి వీసా ముగిసినప్పటికీ.. ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. క్లెమెంట్ గతంలో చండీగఢ్‌లో చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. వీరిని నైజీరియా డిపోర్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.