- కలెక్టర్ విజయేందిర బోయి
హన్వాడ, వెలుగు : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి వైద్యులకు సూచించారు. మంగళవారం గండీడ్, హన్వాడ మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. గండీడ్ మండలంలో బీసీ వసతి గృహం, గిరిజన సంక్షేమశాఖ మినీ గురుకుల పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాలు తనిఖీ చేశారు. ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో అదనపు తరగతి గదులు పూర్తి చేసేందుకు అంచనాలు రూపొందించి నివేదికను పంపించాలని అధికారులను ఆదేశించారు. మండలంలో గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల పాఠశాల స్టోర్ రూం, వంట గది, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
పప్పు, చారు ఒకేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. పగిడ్యాల పల్లె దవాఖానను సందర్శించారు. గర్భిణులు, మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. హన్వాడ మండలం కోతులాబాద్ గ్రామ పీహెచ్సీని తనిఖీ చేశారు.
పీహెచ్సీ పరిధిలో డెంగ్యూ కేసులు ఏమైనా వచ్చాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మందులు మందుల గది, ల్యాబ్ రూంను పరిశీలించారు. అనంతరం రామన్నపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట బీసీ అభివృద్ధి అధికారి ఇందిర, మండల, గ్రామ అధికారులు తదితరులు ఉన్నారు.
